ఎయిరిండియాకు కొత్త రెక్కలు!

29 Mar, 2018 01:59 IST|Sakshi

76 శాతం వాటాల విక్రయానికి సై...

రెండు అనుబంధ సంస్థలోనూ

ఆసక్తి వ్యక్తీకరణకు కేంద్రం ఆహ్వానం

నాలుగు అనుబంధ సంస్థల డీమెర్జర్‌

న్యూఢిల్లీ: భారీగా రుణాలు పేరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా... ప్రైవేటీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. కంపెనీలో వ్యూహాత్మక వాటా విక్రయానికి సంబంధించిన ప్రాథమిక సమాచార పత్రాన్ని కేంద్రం బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఎయిరిండియాలో 76 శాతం వాటాలు విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే, లాభాల్లో ఉన్న చౌక విమాన సేవల విభాగం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, సింగపూర్‌కి చెందిన ఎస్‌ఏటీఎస్‌తో కలిపి ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ సంస్థ ఏఐఏటీఎస్‌ఎల్‌లో కూడా డిజిన్వెస్ట్‌మెంట్‌ ఉంటుంది.

ఏఐఏటీఎస్‌ఎల్‌... కొన్ని మెట్రో ఎయిర్‌పోర్ట్‌లలో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సర్వీసులు అందిస్తోంది. ప్రాథమిక సమాచార పత్రం ప్రకారం... ఎయిరిండియాకు చెందిన మరో నాలుగు అనుబంధ సంస్థలను విడగొడతారు. ఏఐఈఎస్‌ఎల్‌ (ఎయిరిండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌), ఏఐఏటీఎస్‌ఎల్‌ (ఎయిరిండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌), హెచ్‌సీఐ (హోటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా), ఏఏఎస్‌ఎల్‌ (ఎయిర్‌లైన్‌ అలైడ్‌ సర్వీసెస్‌) సంస్థలు ఇందులో ఉన్నాయి.

ఏఐఈఎస్‌ఎల్‌ ప్రధానంగా ఇంజిన్ల మెయింటెనెన్స్‌ సర్వీసులు, ఏఐఏటీఎస్‌ఎల్‌.. గ్రౌండ్, కార్గో హ్యాండ్లింగ్‌ సర్వీసులు అందిస్తున్నాయి. ఇక హెచ్‌సీఐకి ఢిల్లీ, శ్రీనగర్‌లో రెండు హోటల్స్‌ ఉన్నాయి. ఎయిరిండియాలో ప్రాంతీయ సేవల విభాగమైన ఏఏఎస్‌ఎల్‌ సంస్థ.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ ఇండిగో ఇప్పటికే ఆసక్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్‌ ఫ్రాన్స్, అమెరికాకు చెందిన డెల్టాతో కలిసి జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా బిడ్‌ చేయొచ్చన్న వార్తలు వస్తున్నాయి.

బిడ్డరుకు రూ.5 వేల కోట్ల నికర విలువ..
ఎయిరిండియాలో వాటాల కొనుగోలు కోసం విదేశీ ఎయిర్‌లైన్స్‌ సహా వివిధ సంస్థల నుంచి పౌర విమానయాన శాఖ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) ఆహ్వానించింది. ఈవోఐలు సమర్పించడానికి మే 14 ఆఖరు తేదీ. షార్ట్‌లిస్ట్‌ చేసిన బిడ్డర్లకు మే 28న సమాచారమిస్తారు. ఎయిరిండియాలో వాటాలు కొనుగోలు చేసిన బిడ్డరు.. సంస్థలో కనీసం మూడేళ్ల పాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. బిడ్డింగ్‌ చేసే సంస్థ నికర విలువ కనీసం రూ. 5,000 కోట్లు ఉండాలి.

ఇతర సంస్థలతో కన్సార్షియంగా ఏర్పడి గానీ లేదా ఒకే సంస్థ సింగిల్‌గానైనా బిడ్డింగ్‌ వేయొచ్చు. కన్సార్షియంలో భాగమైన ప్రతీ సంస్థ.. ఈవోఐ డెడ్‌లైన్‌కి ముందు అయిదు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం మూడేళ్ల పాటు లాభాలు ఆర్జించినదై ఉండాలి. అయితే, ఒకవేళ కన్సార్షియంలో సభ్యత్వం ఉన్న సంస్థ భారత్‌లో షెడ్యూల్డ్‌ ఎయిర్‌లైన్‌ ఆపరేటర్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండి, మొత్తం కన్సార్షియం పెయిడప్‌ ఈక్విటీ షేరు క్యాపిటల్‌లో వాటా గరిష్టంగా 51 శాతానికి మించకుండా ఉంటే.. ఈ నిబంధన వర్తించదు.

కానీ భారత్‌లో షెడ్యూల్డ్‌ ఎయిర్‌లైన్‌ ఆపరేటరుగా కార్యకలాపాలు లేని విదేశీ ఎయిర్‌లైన్స్‌కి మాత్రం ఈ నిబంధన తప్పనిసరి. బ్యాంకుతో లేదా వెంచర్‌ క్యాపిటలిస్టులు లేదా ఆర్థఇక సంస్థ లేదా ఫండ్‌తో కలిసి కన్సార్షియంను ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యూహాత్మక వాటాల విక్రయ ప్రక్రియకు సలహాదారుగా కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ వ్యవహరిస్తుంది.


రూ.50 వేల కోట్ల రుణభారం..
ఎయిరిండియాకు దాదాపు రూ.50,000 కోట్ల మేర రుణభారం ఉంది. 2012లో గత ప్రభుత్వం ఆమోదించిన టర్న్‌ అరౌండ్‌ ప్రణాళిక కింద అందిస్తున్న నిధులతో సంస్థ నెట్టుకొస్తోంది. 2017 డిసెంబర్‌ ఆఖరు నాటికి ఎయిరిండియాకు 115 విమానాలుండగా, 39 అంతర్జాతీయ రూట్లకు సర్వీసులు నడుపుతోంది.

సుమారు 11,214 మంది పర్మనెంటు ఉద్యోగులు, 2,913 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ఎయిరిండియా భారీ రుణాల నేపథ్యంలో కంపెనీలో వ్యూహాత్మక వాటాల విక్రయం చేపట్టే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ 2017 జూన్‌లో సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది.

>
మరిన్ని వార్తలు