ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను అమ్మేద్దామా..

31 Oct, 2018 00:45 IST|Sakshi

కొత్త బోర్డు పరిశీలనలో పలు ప్రతిపాదనలు

నేడు ఎన్‌సీఎల్‌టీ ముందుకు పరిష్కార ప్రణాళిక

న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) సంక్షోభం మరింత విస్తరించకుండా సమస్య పరిష్కారానికి కొత్త బోర్డు పలు మార్గాలు పరి శీలిస్తోంది. ఆర్థికంగా బలమైన ఇన్వెస్టరుకు సంస్థను గంపగుత్తగా విక్రయించడం ద్వారా వ్యాపారాన్ని నిలబెట్టాలన్న ప్రతిపాదన కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు కంపెనీ కొత్త బోర్డు బుధవారం సమర్పించబోయే ప్రణాళికల్లో ఇది ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

వ్యాపారాలను వివిధ విభాగాలుగా విడగొట్టి వేర్వేరుగా విక్రయించడం లేదా ఏకమొత్తంగా అమ్మేయాల్సిన అవసరం రాకుండా గ్రూప్‌ స్థాయిలో తగినంత నిధులను సమకూర్చడం తదితర ప్రతిపాదనలు వీటిలో ఉన్నట్లు వివరించాయి. రూ. 90,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ పలు లోన్‌లను తిరిగి చెల్లించడంలో విఫలం కావడం, అది మార్కెట్లపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడం తెలిసిందే. కంపెనీ ఖాతాల ప్రకారం మార్చి 2018 నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ దాదాపు రూ. 63,000 కోట్ల రుణం తీసుకుంది.

కంపెనీ వ్యవహారాలపై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో) విచారణ జరుపుతోంది. సంస్థను గాడిన పెట్టేందుకు కేంద్రం ప్రముఖ బ్యాంకరు ఉదయ్‌ కొటక్‌ సారథ్యంలో కొత్త బోర్డును నియమించింది. ఈ బోర్డు అక్టోబర్‌ 31న తగు పరిష్కార ప్రణాళికను ఎన్‌సీఎల్‌టీకి సమర్పించాల్సి ఉంది. కంపెనీ వ్యవహారాలపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ రుణాల చెల్లింపు కోసం నిధులను సమీకరించుకునే దిశగా ప్రధాన, ప్రధానేతర వ్యాపారాలను విక్రయించే అంశాన్ని బోర్డు పరిశీలించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు