మొండి బకాయిలకు ‘బ్యాడ్ బ్యాంక్’!

18 Feb, 2016 01:41 IST|Sakshi
మొండి బకాయిలకు ‘బ్యాడ్ బ్యాంక్’!

పరిశీలిస్తున్న ప్రభుత్వం
 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెరిగిపోతున్న మొండి బకాయిల సమస్య పరిష్కారంపై సర్కారు కసరత్తు చేస్తోంది. దీనికోసం ప్రత్యేక బ్యాంకునో లేదా కంపెనీనో ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ‘అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటుపై చర్చించాం. అయితే బ్యాంకర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి’ అని సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులున్న పరిస్థితులు చూస్తే ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు యోచన అంత తీసిపారేయదగ్గది కాదని పీఎన్‌బీ ఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ చెప్పారు. అయితే దీనివల్ల బ్యాంకుల్లో అలసత్వం పెరిగే ప్రమాదం కూడా ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

బ్యాంకులు తమ మొండి బకాయిలను రాబట్టుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించకుండా సదరు ‘బ్యాడ్ బ్యాంక్’కు బదలాయించే సే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటులాంటివేవీ అక్కర్లేదని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవలే వ్యాఖ్యానించారు. బ్యాంకులు ఇప్పటికే వీటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. మొండి బకాయిలు రాబట్టుకునేందుకు బ్యాంకులకు మరిన్ని అధికారాలు ఇవ్వడాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం వెల్లడించారు. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదన చర్చనీయాంశమయింది.

మరిన్ని వార్తలు