బ్యాంకుల్లో ప్రజల సొమ్ము పదిలమే

20 Jun, 2018 00:16 IST|Sakshi

మోసాలకు పాల్పడుతున్నది ప్రైవేట్‌ కంపెనీలే

ఆర్‌బీఐకి మరిన్ని అధికారాలిచ్చేందుకు సిద్ధం

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని (పీఎస్‌బీ) ప్రజల సొమ్ముకు ’అత్యంత భద్రత’ ఉంటుందని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. పీఎస్‌బీలకు నూటికి నూరు శాతం ప్రభుత్వ మద్దతుంటుందని ఆయన చెప్పారు. 13 ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో మంగళవారం సమావేశమైన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలియజేశారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో (పీఎన్‌బీ) దాదాపు రూ.14,000 కోట్ల కుంభకోణం సహా బ్యాంకింగ్‌ రంగంలో పలు స్కామ్‌లు బయటపడుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రజల సొమ్ము భద్రంగానే ఉంటుందని.. కాకపోతే భారీగా ఆదాయ పన్ను బాకీలు పడ్డ ప్రైవేట్‌ కంపెనీల్లోకి మళ్లిన ప్రజల నిధులు ఎంత మేర భద్రంగా ఉంటాయన్నది తాను చెప్పలేనని గోయల్‌ వ్యాఖ్యానించారు.

మోసాలు చేసినది ప్రైవేట్‌ కంపెనీలే తప్ప ప్రభుత్వ బ్యాంకులు కాదన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రజల సొమ్ముకు నూటికి నూరు శాతం భద్రత ఉంటుందని భరోసా ఇస్తున్నాను. పీఎస్‌బీలకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు.  

రిజర్వ్‌ బ్యాంక్‌కు పూర్తి అధికారాలున్నాయి..
పీఎస్‌బీలను సమర్థంగా నియంత్రించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌కి అన్ని అధికారాలు ఉన్నాయని గోయల్‌ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆర్‌బీఐ కోరుతున్నట్లుగా మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు.

పీఎస్‌బీలను నియంత్రించేందుకు తమకు మరిన్ని అధికారాలు అవసరమని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఇటీవల పార్లమెంటరీ కమిటీకి తెలిపిన సంగతి తెలిసిందే. ‘రిజర్వ్‌ బ్యాంక్‌కి పూర్తి అధికారాలు ఉన్నాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అయినప్పటికీ, మరిన్ని అధికారాలు అవసరమైతే ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఈ విషయాలపై ఆర్‌బీఐ, ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకుంటాయి‘ అని గోయల్‌ చెప్పారు.  

చిన్న సంస్థలకు రుణాలపై పీఎస్‌బీల దృష్టి..
పీఎస్‌బీలు ప్రధానంగా చిన్న, మధ్య తరహా సంస్థలపై దృష్టి సారిస్తున్నాయని గోయల్‌ చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా నిఖార్సయిన కార్పొరేట్‌ కంపెనీలకు కూడా తోడ్పాటునివ్వాలని బ్యాంకులు నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

‘ఎంఎస్‌ఎంఈలు, నిఖార్సయిన మంచి కంపెనీల వర్కింగ్‌ క్యాపిటల్‌ తదితర రుణ అవసరాలు తీర్చడంపై మళ్లీ దృష్టి పెట్టాలని పీఎస్‌బీలు నిర్ణయించాయి‘ అని మంత్రి పేర్కొన్నారు. రెండు దశల్లో దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. తొలి దశలో రూ. 200 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల దాకా రుణాలు ఉన్న కంపెనీలను, రెండో దశలో రూ. 200 కోట్ల దాకా రుణాలున్న కంపెనీల అవసరాలను పీఎస్‌బీలు పరిశీలించి, నిర్ణయం తీసుకుంటాయని గోయల్‌ చెప్పారు.

మళ్లీ మొండిబాకీల సమస్య తలెత్తకుండా ఈ విషయంలో బ్యాంకులు విడివిడిగా గాకుండా కన్సార్షియంగా కలిసి పనిచేస్తాయని తెలిపారు.అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ లేదా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఏర్పాటుపై పీఎన్‌బీ చైర్మన్‌ సునీల్‌ మెహతా సారథ్యంలో ఏర్పాటైన సబ్‌ కమిటీ త్వరలో నివేదిక సమర్పించనుందని ఆయన చెప్పారు.  

బ్యాంకర్లతో భేటీలో మొండిబాకీలపై చర్చ..
బ్యాంకింగ్‌ చీఫ్‌లతో మంత్రి భేటీ సందర్భంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో భారీగా పేరుకుపోతున్న మొండిబాకీలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. అలాగే, రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోని బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అనుబంధ బ్యాంకుల విలీనాల అనుభవాలను ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వివరించారు. బ్యాంకింగ్‌ రంగంలో కన్సాలిడేషన్‌కి సంబంధించిన లోటుపాట్ల గురించి కూడా చర్చించినట్లు సమావేశం అనంతరం విలేకరులకు ఆయన తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా