స్టాక్‌ మార్కెట్లో ఎయిర్‌ ఇండియా!

14 Jun, 2018 00:33 IST|Sakshi

విఫలమైన వాటా విక్రయం 

వివిధ ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ 

 స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌ కూడా వాటిల్లో ఒకటి  

న్యూఢిల్లీ: భారీ రుణ భారంతో కుదేలైన ఎయిర్‌ ఇండియాను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎయిర్‌ ఇండియాలో 76 శాతం వ్యూహాత్మక వాటా విక్రయం విఫలం కావడంతో ఈ కంపెనీని ఒడ్డెక్కించడానికి వివిధ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఆ మార్గా ల్లో ఎయిర్‌ ఇండియాను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయడం కూడా ఒకటని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎయిర్‌ ఇండియాను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయడం వల్ల ఆదాయం పెరుగుతుందని, పైగా ఈ కంపెనీపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది మార్చి నాటికి ఎయిర్‌ ఇండియాకు రూ.50,000 కోట్ల మేర రుణ భారముంది. ప్రతిపాదిత డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికలో భాగంగా రూ.33,000 కోట్ల రుణ భారం మిగులుతుంది. 76 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించగా, ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదు. 

కాగా ఎయిర్‌ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియను మంత్రుల సంఘం నిర్ణయిస్తుందని పౌర విమానయాన మంత్రి సురేశ్‌ ప్రభు ఇటీవలే చెప్పారు. ఈ సంఘం వివిధ ప్రత్యామ్నాయాలను చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. మరోవైపు  ఎయిర్‌ ఇండియా కార్మిక సంఘాలు మాత్రం వాటా విక్రయ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌... ఎయిర్‌ ఇండియా ఐపీఓకు రావాలని డిమాండ్‌ చేస్తోంది. విదేశీ సొర చేపల నుంచి ఎయిర్‌ ఇండియాను రక్షించాలంటే ఐపీఓ ఒక్కటే మార్గమని ఇది అంటోంది.   

మరిన్ని వార్తలు