రూ.500 నోట్ల ప్రింటింగ్‌ పెంపు

17 Apr, 2018 17:06 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న నగదు కొరతను తగ్గించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. 500 రూపాయల కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌ను ఐదు సార్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ తెలిపారు. ‘డిమాండ్‌కు తగ్గట్టు కరెన్సీ సరఫరాను మరింత పెంచేందుకు మేము చర్యలు తీసుకుంటున్నాం. ఉదాహరణకు రోజుకు 500 కోట్ల రూ.500 నోట్ల ప్రింటింగ్‌ను చేపడుతుంటే, ఈ ఉత్పత్తిని ఐదింతలు పెంచేందుకు చర్యలు తీసుకున్నాం’ అని గార్గ్‌ చెప్పారు. దేశంలో పలు ప్రాంతాల్లో నగదు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే రిపోర్టులపై ఆయన ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. 

వచ్చే రెండు రోజుల్లో రోజుకు రూ.2500 కోట్ల విలువైన 500 రూపాయల నోట్లను సరఫరా చేయనున్నట్టు తెలిపారు. దీంతో నెలకు సరఫరా రూ.70వేల కోట్ల నుంచి రూ.75వేల కోట్ల వరకు ఉంటుందన్నారు. ఈ నోట్లు డిమాండ్‌ను మించిపోనున్నట్టు చెప్పారు. డిమాండ్‌కు మించి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు కరెన్సీ స్టాక్‌ ఉందని, గత కొన్ని రోజులుగా ఈ నగదును సిస్టమ్‌లోకి పంపించామని, ఇంకా రూ.1.75 లక్షల కోట్ల రిజర్వులు తమ వద్ద ఉన్నట్టు పేర్కొన్నారు. కానీ గత రెండు నెలల నుంచి అసాధారణంగా ఎక్కువ డిమాండ్ ఏర్పడిందన్నారు.  ఈ అసాధారణ డిమాండ్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో చోటు చేసుకుందని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కొరత  తాత్కాలికమేననీ త్వరలోనే  పరిస్థితి చక్కబడుతుందంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ  ట్వీట్‌ కూడా చేశారు.  అటు  పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందనీ,  వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
 

మరిన్ని వార్తలు