లాభాల కోసం చూడొద్దు.. అమ్మేసుకోండి!

30 Apr, 2020 04:48 IST|Sakshi
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

వడ్డీ భారం తగ్గించుకోండి

రియల్టర్లకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సూచన...

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో ఏటేటా పెరుగుతున్న అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ) మీద కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డెవలపర్లు అత్యాశగా లాభాల కోసం ఎదురుచూడకుండా ఇన్వెంటరీ గృహాలను విక్రయించుకోవాలని.. దీంతో కనీసం బ్యాంక్‌ వడ్డీ భారాౖన్నైనా తగ్గించుకోవాలని  సలహా ఇచ్చారు. నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నరెడ్కో) ఏర్పాటు చేసిన వెబ్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇన్వెంటరీ గృహాల విషయంలో అత్యాశ వద్దు. ఎంత ధర వచ్చినా సరే విక్రయించడమే ఉత్తమం. కనీసం చేతిలో నగదు లభ్యత అయినా పెరుగుతుంది. ముంబైలో చాలా మంది బిల్డర్లు ప్రీమియం ధర రావాలని ఇన్వెంటరీని విక్రయించడం లేదు. చ.అ.కు రూ.35–40 వేల ధర వచ్చే వరకు ఎదురుచూస్తున్నారని’’ వివరించారు.

ఇన్వెంటరీ కొనుగోళ్ల కోసం వచ్చే కస్టమర్లతో డెవలపర్లు ధరల గురించి చర్చించాలని, బ్యాంక్‌లు, ప్రైవేట్‌ రుణదాతల వడ్డీ వ్యయ భారం నుంచి విముక్తి కోసమైనా వీటిని విక్రయించడమే మేలని చెప్పారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి, గృహ విభాగంలో డిమాండ్‌ను సృష్టించడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు విస్తరించాలన్నారు. రూ.10 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలను నిర్మించాలని కోరారు. రోడ్లు, రహదారుల విభాగంలో భారీ వ్యాపార అవకాశాలున్నాయి. ప్రీకాస్ట్‌ టెక్నాలజీ వినియోగంతో లాజిస్టిక్‌ పార్క్‌లు, రహదారుల నిర్మాణంలోకి రావాలని సూచించారు. రహదారుల వెంట బస్‌ డిపోలు, పెట్రోల్‌ పంప్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, రైల్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లు వంటివి అభివృద్ధి చేస్తున్నామని.. ఆసక్తివున్న నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం కావాలని సూచించారు. ముంబై–ఢిల్లీ కారిడార్‌లో టౌన్‌షిప్‌ల నిర్మాణం ప్రణాళికలో ఉందని చెప్పారు.

సొంతంగా ఫైనాన్స్‌ కంపెనీలు పెట్టుకోండి..
నిర్మాణ కంపెనీలు తమ వ్యాపార విభాగాలను మార్చుకోవాలని, సొంతంగా హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలను స్థాపించాలని సూచించారు. ఉదాహరణకు ఆటోమొబైల్‌ పరిశ్రమలో చాలా తయారీ కంపెనీలకు సొంతంగా ఆటో ఫైనాన్స్‌ కంపెనీలున్నాయని తెలిపారు. అలాగే నిర్మాణ సంస్థలు కూడా సొంతంగా గృహ రుణ కంపెనీలను ఏర్పాటు చేసుకొని కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందించాలని సూచించారు. దీంతో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల మీద పూర్తిగా ఆధారపడాల్సిన అవసరముండదని పేర్కొన్నారు. ప్రైవేట్‌ వ్యక్తులు, ఇన్వెస్టర్లలకు ఈక్విటీ ఇష్యూల ద్వారా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎన్‌బీఎఫ్‌సీలు నిధులను సమీకరించాలని సూచించారు.  

మరిన్ని వార్తలు