ఇక కార్ల ధరలు మోతే..?

20 Apr, 2018 12:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:భారతదేశంలో డీజిల్ వాహనాలు, ఇతర ఖరీదైన కార్లు త్వరలోనే మరింత ప్రియం కానున్నాయి. కొత్త కార్లపై దేశవ్యాప్తంగా కొత్త ఏకీకృత పన్ను అమలుకు రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. అన్ని రకాల వాహనాలపై వన్‌ నేషన్‌-వన్‌ పర్మిట్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది.  ఒకవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మంటలు పుట్టిస్తోంటే  వాహనదారులకు   మరో షాక్‌ తగిలింది.  అలాగే డీజిల్‌ వాహనాలపై పన్నును 2శాతం పెంచాలని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదించి. విద్యుత్‌ వాహనాలపై పన్నులు తగ్గించాలని సిఫారసు చేసింది.  డీజిల్ వాహనాలపై 2 శాతం వరకు పన్నులు విధించాలని ప్రతిపాదించింది.   ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఓ సర్క్యులర్‌ జారీ  చేసింది. అలాగే శుక్రవారం వరుస ట్వీట్లు  చేసింది.  తాజా పన్ను ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అటు డీజిల్‌ వాహనాలు, ఇటు  ఎస్‌యూవీల ధరలు కొండెక్కడం ఖాయం.

ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్నులను మరింత తగ్గించాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. వాహనాల కోసం ప్రత్యామ్నాయ ఇంధనాన్ని,  విద్యుత్‌ వాహనాల వినియోగానికి  ప్రోత్సాహమిచ్చే దిశగా ఎలక్ట్రిక్ వాహనాలపై  పన్నులు తగ్గించాలని కోరింది. ప్రస్తుతం వీటిపై 12శాతం పన్ను ఉంది. దీన్ని మరింత తగ్గిస్తే వినియోగదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారని మంత్రిత్వ శాఖ ఆలోచన.

కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ప్రతిపాదనల ప్రకారం  డీజిల్‌ వాహనాలపై పన్ను 2శాతం పెరగనుంది. ప్రస్తుతం 4 మీటర్ల కంటే తక్కువ పొడవు, 1.5 లీటర్ల కంటే తక్కువ ఇంజిన్‌ సామర్థ్యం గల డీజిల్‌ కార్లపై 31శాతం పన్ను ఉంది. తాజా ప్రతిపాదనలతో ఇది 33శాతం కానుంది. దీంతో జీఎస్‌టీకి ముందు డీజిల్‌ కార్లపై పన్నులు ఎలా ఉండావో.. మళ్లీ అలాగే ఉండనున్నాయి. కాగా  తాజా ప్రతిపాదనలు ఎపుడు అమల్లోకి వచ్చేది అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు