ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు గట్టి షాక్‌!

15 Dec, 2017 12:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  విదేశీ  స్మార్ట్‌ఫోన్‌  తయారీదారులకు షాకిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పటికే  బేసిక్‌ ఎక్సైజ్ సుంకంతో విదేశీ మొబైల్స్‌కు చెక్‌ చెప్పిన  ప్రభుత్వం మరోసారి  కొరడా ఝుళిపించింది. వివిధ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, మొబైల్స్‌పై  బేసిక్‌ ఎక్సైజ్ సుంకాన్ని  పెంచుతూ  ఆదేశాలు జారీ చేసింది.  దీంతో ఇకనుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్న మొబైల్‌ ఫోన్ల ధరలు మోత  మోగనున్నాయి.  మేక్‌ ఇన్‌ ఇండియాకు మరింత  ప్రోత్సాహమిచ్చే దిశగా  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మొబైల్ ఫోన్లపై గతంలో విధించిన 10శాతం  బేసిక్‌  ఎక్సైజ్ సుంకాన్ని తాజాగా 15శాతానికి పెంచింది. దీనికి సంబంధించి గురువారం రాత్రి  రెవెన్యూ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే  కలర్‌ టీవీలు, మైక్రోవేవ్‌ అవెన్‌లపై  బేసిక్‌ కస్టమ్‌ సుంకాన్ని 20శాతంగా నిర్ణయించింది.  ఎలక్ట్రిక్ ఫిల్మెంట్,  వాటర్‌ హీటర్లు, హెయిర్‌ డ్రెస్సింగ్‌ సాధనాలు,  డిశ్చార్చ్‌ లాంప్స్ లాంటి కొన్ని ఇతర అంశాలపై కూడా  కస్టమ్స్ సుంకాన్ని సవరించింది. దేశీయ పరిశ్రమలకు ప్రోత్సహహంతోపాటు,  ఇప్పటికే తయారీలో ఉన్న కంపెనీలకు  గట్టి పోటీ ఉండేలా  ఈ చర్య  చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

కాగా గత జూలైలో మొదటిసారి బేసిక్‌ కస్టమ్‌ సుంకాన్ని విధించిన  ప్రభుత్వం  దేశీయ మొబైల్‌ కంపెనీలకు ఊతమిచ్చేలా విదేశీ మొబైల్స్‌పై దీన్ని10శాతంగా  పేర్కొన్న సంగతి విదితమే.
 

మరిన్ని వార్తలు