ఐటీ శాఖ శుభవార్త : దిగ్గజాలు హర్షం

22 Jul, 2020 17:47 IST|Sakshi

ఐటీ ఉద్యోగులకు ఊరట

డిసెంబర్ 31 వరకు వర్క్‌ ఫ్రం హోం 

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో ఐటీ కంపెనీలకు, ఉద్యోగులకు భారత ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్ర‌క‌టించింది. దేశంలోకరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 కారణంగా ప్రజల్లో నెలకొన్న భయాందోళనను దృష్టిలో ఉంచుకొని ఇంటి నుంచి పనిచేసుకునే విధానాన్ని  2020 డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేష‌న్స్ ‌ (డాట్‌) ఒక ప్రకటన విడుదల చేసింది. 

మరోవైపు ఈ నిర్ణయంపై నాస్కాంతోపాటు పలువురు ఐటీ కంపెనీ అధినేతలు హర్షం ప్రకటించారు. భారతీయ ఐటీ పరిశ్రమ వ్యాపార నిర్వహణకు, ఐటీ ఉద్యోగుల రక్షణకు బలమైన సహకారాన్ని అందిస్తున్నారంటూ నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవ్‌జానీ ఘోష్‌ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు ధన్యావాదాలు తెలిపారు. మొదటినుంచి తమకు భారీ మద్దతు అందిస్తు‍న్నకేంద్రానికి విప్రో ఛైర్మన్ రిషద్‌ ప్రేమ్‌జీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేకుండా అవకాశం కల్పించిన డాట్‌కు  బిగ్‌ థ్యాంక్స్‌ అంటూ టెక్‌‌ మహీంద్రా సీఈవో  సీపీ గుర్నాని ట్వీట్‌ చేశారు.  

​కాగా దేశంలో కరోనా వైరస్ ఉధృతి కార‌ణంగా చాలా వ‌ర‌కు ఐటీ కంపెనీలు త‌మ ఉద్యోగులు ఇంటి నుంచే  పనిచేసే విధానాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.  మొదట ఏప్రిల్ 30 వరకు వర్క్‌ ఫ్రం హోం  విధానానికి అనుమతినిచ్చిన  కేంద్రం, కోవిడ్-19 విస్తరణ నేపథ్యంలోతరువాత  ఈ గ‌డువును జూలై 31 వరకు పొడిగించింది.  తాజాగా మరోసారి ఐటీ ఉద్యోగులకు  ఈ అవకాశాన్ని పొడిగించడం విశేషం. 

మరిన్ని వార్తలు