రూ.1,150 కోట్ల విప్రో ‘శత్రు’ షేర్ల విక్రయం 

6 Apr, 2019 00:37 IST|Sakshi

   కొనుగోలు చేసిన ఎల్‌ఐసీ, ఇతర బీమా సంస్థలు

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో కంపెనీలో రూ.1,150 కోట్ల విలువైన శత్రు షేర్లను ప్రభుత్వం విక్రయించింది. విప్రో కంపెనీకి చెందిన 4.43 కోట్లకు పైగా షేర్లను, ఒక్కో షేర్‌ను కూ.258.90 ధరకు కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ ఫర్‌ ఇండియా విక్రయించింది. ఈ షేర్లను ఎల్‌ఐసీ, జనరల్‌ ఇన్సూ రెన్స్‌ కార్పొరేషన్, ద న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కార్పొరేషన్‌లు కొను గోలు చేశాయని బీఎస్‌ఈ బ్లాక్‌డీల్‌ డేటా వెల్లడించింది. ఈ సొమ్ములు ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్‌ ఖజానాలోకి జమ అవుతాయి.

పాకిస్తాన్, చైనా లకు వలస వెళ్లిన, భారత పౌరసత్వం కోల్పోయిన వారి ఆస్తులను, శత్రుదేశాలకు చెందిన సంస్థల ఆస్తులను శతృ ఆస్తులుగా పరిగణిస్తారు. ఇలాంటి శత్రు ఆస్తులు, షేర్ల విషయమై చర్యలు తీసుకోవడానికి ద కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ ఫర్‌ ఇండియా అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పనిచేస్తోంది. కంపెనీల్లో ఉన్న ఇలాంటి శత్రు షేర్లను విక్రయించే విధానానికి గత ఏడాది నవంబర్‌లోనే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇలా దశాబ్దాలుగా పోగుపడిన శత్రు చరాస్తులను విక్రయించి అలా వచ్చిన నిధులను సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు, సామాజిక అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగిస్తారు.   

మరిన్ని వార్తలు