40వేల కోట్లతో జాతీయ ఇన్‌ఫ్రా నిధి

30 Dec, 2015 01:10 IST|Sakshi
40వేల కోట్లతో జాతీయ ఇన్‌ఫ్రా నిధి

న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే లక్ష్యంతో కేంద్రం రూ. 40,000 కోట్ల జాతీయ పెట్టుబడి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్)ను ఏర్పాటు చేసింది. దీనికి సీఈవో నియామక ప్రక్రియ జనవరి ఆఖరు నాటికి పూర్తి కాగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రష్యా, సింగపూర్, బ్రిటన్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల సావరిన్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్.. ఎన్‌ఐఐఎఫ్‌లో పాలు పంచుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్‌ఐఐఎఫ్ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ విషయాలు తెలిపారు.

ఫండ్ పనితీరును సమీక్షించేందుకు మార్చిలో కౌన్సిల్ మరోసారి సమావేశమవుతుందని చెప్పారు. ఈ నిధికి ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) పెట్టుబడుల సలహాదారుగా ఆరు నెలల పాటు వ్యవహరిస్తుంది. అలాగే ఎన్‌ఐఐఎఫ్ ట్రస్టీ లిమిటెడ్ సంస్థకు ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ ఏడాది పాటు సలహాదారుగా వ్యవహరిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎన్‌ఐఐఎఫ్‌కు బడ్జెట్ నుంచి ప్రభుత్వం రూ.20,000 కోట్ల మేర కేటాయింపులు జరపనుండగా, ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి మరో రూ. 20,000 కోట్లు వస్తాయని అంచనా. కొత్త వాటితో పాటు నిలిచిపోయిన ప్రాజెక్టులు, విస్తరణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు కేంద్రం దీన్ని ఏర్పాటు చేస్తోంది. దీని గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా ఆర్థిక మంత్రి వ్యవహరిస్తుండగా, ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య, కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి అంజలి చిబ్ దుగ్గల్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో ప్రభుత్వ వాటా 49శాతం లోపు ఉంటుంది.

మరిన్ని వార్తలు