దీనిపై కేంద్రం కొత్త పాలసీ: త్వరలో

9 Dec, 2017 19:56 IST|Sakshi

సాక్షి, ముంబై: త్వరలోనే పెట్రోల్‌ రేట్లను తగ్గించే  పాలసీని తీసుకురానున్నామని కేంద్ర  రోడ్ల శాఖామంత్రి  నితిన్‌ గడ్కరీ  ప్రకటించారు. ఇందుకు వీలుగా కొత్త విధానాన్ని ప్రకటించనున్నట్టు ముంబయిలో  తెలిపారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ విధానాన్ని  ప్రకటించనున్నామని శనివారం వెల్లడించారు.  

పెట్రోలులో 15 శాతం మెథనాల్ మిశ్రమాన్ని ద్వారా ధరలు  దిగి వస్తాయన్నారు. తద్వారా  కాలుష్యాన్ని కూడా అరికట్ట వచ్చని చెప్పారు.  బొగ్గునుంచి  లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 80లతో  పోలిస్తే , మిథనాల్‌ ఉత్పత్తికి అయ్యే ఖర్చు కేవలం రూ .22లు మాత్రమేనని చెప్పారు.   చైనా రూ.17 లకే లీటర్‌ ఉత్పత్తి  చేస్తోందన్నారు.   ఈ కొత్త విధానం ద్వారా ఖర్చులూ తగ్గుతాయి, కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. దీపక్ ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్‌సీఎఫ్) సహా ముంబై చుట్టుపక్కల చాలా కర్మాగారాలు మెథనాల్‌ను ఉత్పత్తి చేయగలవని  కేంద్ర మంత్రి అన్నారు.

స్వీడన్‌  ఆటో మేజర్‌ వోల్వో మిథనాల్‌ తో నడిచే  స్పెషల్‌ ఇంజీన్‌ను రూపొందించిందనీ, లోకల్‌గా తయారైన ఇంధనతో 25 బస్సులను త్వరలో నడపనున్నట్లు గడ్కరీ తెలిపారు. అలాగే ఇథనాల్‌ వినియోగం కూడా పెరగాల్సి ఉందన్నారు. పెద్దఎత్తున పెట్టుబడి పెట్టి చమురు శుద్ధికర్మాగారాలు నెలకొల్పే బదులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తన మంత్రివర్గ సహచరులకు సూచించినట్లు తెలిపారు.

మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌పై గడ్కరీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం రోజుకు 28 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మిస్తున్నామని, దాన్ని 40 కిలోమీటర్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు