విలీన బాటలో మరో మూడు బ్యాంకులు

19 May, 2016 15:44 IST|Sakshi
విలీన బాటలో మరో మూడు బ్యాంకులు

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, తన అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రతిపాదన అనంతరం మరో మూడు బ్యాంకుల విలీన ప్రక్రియ విధానాన్ని కూడా ప్రభుత్వం అన్వేషిస్తోంది. యూకో బ్యాంకుతో పాటు మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్, బ్యాంక్  ఆఫ్ ఇండియాలను కూడా దిగ్గజ సంస్థల్లో విలీనం చేయాలని భావిస్తోంది. బలహీనంగా ఉన్న ఈ బ్యాంకులను, ఆర్థికంగా బలంగా ఉన్న బ్యాంకుల్లో కలిపి, లాభాల్లో నడిపించాని చూస్తోంది. ఈ విలీనానికి  సంబంధించి వివిధ ఆప్షన్ల కోసం ప్రభుత్వం అన్వేషణ ప్రక్రియలో ఉందని ఒక అధికారి వెల్లడించారు.

స్టేట్ బ్యాంకు ప్రతిపాదించిన దాన్ని అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియను త్వరలోనే ప్రభుత్వం మొదలుపెడుతుందని తెలుస్తోంది. తన ఐదు అనుబంధ బ్యాంకుతో పాటు భారతీయ మహిళా బ్యాంకును కూడా విలీనం చేసుకునే ప్రతిపాదనను ఎస్ బీఐ మంగళవారం కేంద్రప్రభుత్వం ముందుంచిన సంగతి తెలిసిందే. ఈ విలీనంతో రూ.5000 కోట్ల స్థిర మూలధనాన్ని అనుబంధ బ్యాంకుల నుంచి ఎస్ బీఐ పొందుతుందని ఆ బ్యాంకు చైర్మన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. అదేవిధంగా విలీన ప్రక్రియ పూర్తైతే బ్యాంకు డిపాజిట్లు 21లక్షల కోట్లకు పైగా కలిగి ఉంటాయని, అడ్వాన్సులు రూ.17.5 లక్షల కోట్లకు పెరుగుతాయని రిపోర్టులు వెల్లడించాయి. దీంతో అన్నీ ప్రపంచ బ్యాంకుల్లో ఉన్న తమ బ్యాంకింగ్ ర్యాంకును మెరుగుపరుచుకుంటామని, బ్యాలెన్స్ షీటు సైజులో 59 నుంచి 55కు పెరుగుతామని భట్టాచార్య పేర్కొన్నారు.

యూకో బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకుల విలీన ప్రక్రియలో బ్యాక్స్ బోర్డు బ్యూరో(బీబీబీ) సహకారాన్ని ప్రభుత్వం తీసుకోనుంది. టెక్నాలజీ పరంగా, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నింటి పరిష్కారంలో ప్రభుత్వానికి బీబీబీ సహకరించనుంది. అవసరమైతే బ్యాంకు బోర్డులతో కూడా బీబీబీ సమావేశం కానుందని అధికారులు చెబుతున్నారు. కలకత్తాకు చెందిన యూకో బ్యాంకుకు మొండిబకాయిలు 6.76 శాతం నుంచి 15.43శాతానికి పెరగడంతో, మార్చి త్రైమాసికంలో రూ.1,715 కోట్ల నికర నష్టాలను నమోదుచేసింది. అదేవిధంగా బ్యాంకు ఆఫ్ ఇండియా డిసెంబర్ త్రైమాసికంలో రూ.1,506 కోట్ల నష్టాలను, ఇండియన్ ఓవర్ సిస్ బ్యాంకు రూ.1,425 కోట్ల నష్టాలను ప్రకటించాయి.

మరిన్ని వార్తలు