నేటి నుంచి కాంకర్లో 5% వాటా విక్రయం

9 Mar, 2016 01:33 IST|Sakshi
నేటి నుంచి కాంకర్లో 5% వాటా విక్రయం

ఆఫర్ ధర రూ.1,195; రిటైలర్లకు 5% డిస్కౌంట్
న్యూఢిల్లీ: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)లో 5% వాటా విక్రయం నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది. రూ.1,195 ధరకు 97,48,710 షేర్లను ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయిస్తుంది. మంగళవారం బీఎస్‌ఈలో ఈ షేర్ ముగిసిన ధర(రూ.1,227)తో పోల్చితే ఇది 2.58% తక్కువ. బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు, గురువారం రిటైల్ ఇన్వెస్టర్లకు షేర్లు విక్రయిస్తారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం ఆఫర్ చేసే ధరలో 5% డిస్కౌంట్ లభిస్తుంది.  మొత్తం 5% వాటాలో 20% వాటా రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మొత్తం ఈ 5% వాటా విక్రయం  కారణంగా ప్రభుత్వానికి రూ.1,165 కోట్లు సమకూరుతాయని అంచనా. మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు మినహా మరే ఇతర సంస్థ కూడా మొత్తం ఆఫర్‌లో 25 శాతానికి మించి బిడ్ చేయడానికి వీలు లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం విక్రయిస్తున్న ఏడో ప్రభుత్వ రంగ వాటా విక్రయం ఇది. రైల్వేల నిర్వహణలో ఉన్న కంటైనర్ కార్పొరేషన్‌లో ప్రభుత్వ వాటా 61.8%గా ఉంది.

మరిన్ని వార్తలు