చిన్న పొదుపు రేట్ల కోతపై...

5 Dec, 2015 01:51 IST|Sakshi
చిన్న పొదుపు రేట్ల కోతపై...

ఆచితూచి నిర్ణయం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ
7వ వేతన కమిషన్ సిఫారసుల అమలు
{దవ్యలోటు లక్ష్యాన్ని నీరుకార్చబోదన్న విశ్వాసం
న్యూఢిల్లీ:
చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీరేటు కోత నిర్ణయాన్ని ఆచితూచి తీసుకుంటామని ఆర్థికమంత్రి శుక్రవారం పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులుసహా పలు వర్గాల ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్న నేపథ్యంలో జైట్లీ తాజా ప్రకటన చేశారు. తన నుంచి రెపో రేటు ప్రయోజనాన్ని యథాతథంగా అమలు చేయాలని ఆర్‌బీఐ పేర్కొంటుండగా... ఇందుకు చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్ రేటు తగ్గాల్సిన పరిస్థితి ఉందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. పొదుపురేట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బ్యాంక్ డిపాజిట్ రేట్లు తగ్గించడం సాధ్యపడదని బ్యాంకింగ్ వాదిస్తోంది. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ 7.5 శాతం డిపాజిట్ రేటు ఆఫర్ చేస్తుండగా, చిన్న పొదుపుకు సంబంధించిన పలు పొదుపు పథకాలు 8.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొదుపురేట్ల కోతపై కేంద్రం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

 హిందుస్తాన్ టైమ్స్ నిర్వహించిన ఒక సదస్సులో జైట్లీ చేసిన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు...
 పెట్రోల్, డిజీల్‌పై పెంచిన సెస్‌ల్ని హైవేల వంటి మౌలిక రంగ ప్రాజెక్టుల ఫండ్‌కు వినియోగిస్తున్నాం. అయితే వేతనాలు, పెన్షన్లపై వెచ్చించే మొత్తం పెరగడం వల్ల సామాజిక రంగంపై అధిక వ్యయపర్చడం సవాలు. ఉదాహరణకు గత ఏడాది ప్రారంభించిన బాలికల సంక్షేమానికి ఉద్దేశించి ప్రారంభించిన (సుకన్యా సమృద్ధి) యోజన విషయంలో 2015-16లో అధికంగా 9.2 శాతం వడ్డీ అమలవుతోంది. ఏడాది తర్వాత  ఈ రేటును భారీగా తగ్గించాల్సి రావచ్చు.  ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎంతో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

చాలా మంది ప్రజలు చిన్న తరహా పొదుపు పథకాలపై వచ్చే ఆదాయంపై ఆధారపడుతున్నారు. ఈ రేటుపై నిర్ణయం తీసుకునే సమయంలో ప్రభుత్వం అత్యంత జాగరూకతతో అన్ని అంశాలనూ పరిశీలిస్తుంది.

ఏడవ వేతన కమిషన్ సిఫారసుల అమలు వల్ల రానున్న రెండుమూడేళ్లలో వార్షికంగా ఖజానాపై రూ.1.02 లక్షల కోట్ల అదనపు భారం పడుతుంది. జనవరి 1 నుంచీ అమలయ్యే ఈ సిఫారసులవల్ల ద్రవ్యలోటు పెరగదు. తొలి దశలో (జీడీపీలో 2.5 శాతం) సిఫారసుల అమలు కొంత కష్టమే. అయితే ఆర్థికాభివృద్ధి పెరిగే కొలదీ ఈ నిష్పత్తి తగ్గుతుంది.   ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5.55 లక్షల కోట్లు (మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో 3.9 శాతం) మించకూడదన్నది బడ్జెట్ లక్ష్యం.  2016-17లో ఈ లక్ష్యాన్ని 3.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది.

{పస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు 7.5 శాతం ఉంటుందని భావిస్తున్నాం. ప్రభుత్వానికి ఆదాయాలు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రానున్న ఆర్థిక సంవత్సరాల్లో ఈ రేటు మరింత బలపడే అవకాశం ఉంది.

వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేటును రాజ్యాంగంలో చేర్చి దీనిపై పరిమితి విధించాలన్న వాదనతో నేను ఏకీభవించను.  సిగరెట్లు, మద్యం వంటి హానికర ఉత్పత్తులపై అధిక పన్ను రేటు అవసరం. ఈ పరిస్థితుల్లో  ప్రొడక్టులపై ప్రామాణిక జీఎస్‌టీ రేటును 18 శాతం రేటు పరిమితిని రాజ్యాంగంలో చేర్చాలన్న కాంగ్రెస్ వాదనను ఆమోదించాల్సిన పనిలేదు.
 

మరిన్ని వార్తలు