భారతి ఎయిర్‌టెల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌, భారీ ఊరట

21 Jan, 2020 20:57 IST|Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌కు భారీ ఊరట లభించింది.  భారతీ ఎయిర్‌టెల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచుకోవడానికి టెలికాం విభాగం (డాట్‌) ఆమోదం తెలిపింది. ఇంతకుముందు అనుమతించిన 49 శాతం నుంచి 100 శాతానికి పెంచుకునేందుకు అనుమతి లభించిందని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్  సమాచారంలో కంపెనీ మంగళవారం తెలిపింది. జనవరి 23 తేదీలోపు  రూ. 35,586 కోట్ల బకాయిలను చెల్లించడానికి  ముందు ఈ ఆమోదం లభించడం గమనార్హం.   ఇందులో  రూ .21,682 కోట్లు లైసెన్స్ ఫీజు, మరో రూ.13,904  కోట్లు స్పెక్ట్రం బకాయిలు (టెలినార్, టాటా టెలిసర్వీస్ బకాయిలను మినహాయించి) ఉన్నాయి.

నష్టాల ఊబిలో కూరుకుపోయిన భారతి టెలికాం సుమారు రూ 4,900 కోట్ల విదేశి పెట్టుబడుల కోసం ప్రభుత్వ అనుమతికోసం వేచి చూస్తోంది. నిధుల సమీకరణలో భాగంగా భారతి టెలికాం పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను సమీకరిస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్ కు చెందిన సింగ్ టెల్ అనే కంపెనీ సహా మరికొన్ని విదేశీ సంస్థల ద్వారా సుమారు రూ 4,900 కోట్ల పెట్టుబడిని సేకరించనుంది.  కాగా  ఎఫ్‌డీఐ దరఖాస్తును కేంద్ర టెలికాం శాఖ తిరస్కరించింది.  ఈ క్రమంలో భారతీ ఎయిర్‌టెల్ తమ సంస్థలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ  రెండోసారి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు