రూ. 233 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వండి

20 Mar, 2014 01:20 IST|Sakshi
రూ. 233 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వండి

 న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌లోని బొగ్గు గని అభివృద్ధి పనులను వేగవంతం చేసే దిశగా రూ. 233 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని విద్యుత్ రంగ దిగ్గజం ఎన్టీపీసీని కేంద్రం ఆదేశించింది. ష్యూరిటీ ఇవ్వని పక్షంలో గని కేటాయింపులను రద్దు చేయాల్సి ఉంటుందని సంస్థ సీఎండీ అరూప్ రాయ్ చౌదరికి పంపిన నోట్‌లో బొగ్గు శాఖ హెచ్చరించింది. లారా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు కావాల్సిన బొగ్గును ఉత్పత్తి చేసుకునేందుకు 2006 జనవరిలో మాండ్ రాయగఢ్ ప్రాంతంలోని తలైపల్లి బ్లాకును కేంద్రం ఎన్టీపీసీకి కేటాయించింది.

దీనిపై ఇప్పటిదాకా ఎన్టీపీసీ సుమారు రూ. 1,464.5 కోట్లు వెచ్చించింది. ఇది 2011 ఫిబ్రవరిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థలం కేటాయింపులు జరగకపోవడం, రెండో దశ అటవీ శాఖ క్లియరెన్స్ లభించకపోవడం తదితర కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని కంపెనీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ప్రైవేట్, పబ్లిక్ సంస్థలకు ఇచ్చిన బొగ్గు బ్లాకుల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన అంతర్ మంత్రిత్వ బృందం (ఐఎంజీ).. ఎన్టీపీసీ నుంచి ష్యూరిటీ తీసుకోవాలని సూచించింది.

మరిన్ని వార్తలు