కేన్సర్‌ ఔషధాల ధరలకు కళ్లెం

28 Feb, 2019 00:19 IST|Sakshi

నాన్‌ షెడ్యూల్డ్‌ విభాగంలోని 42 డగ్స్‌కు చోటు

న్యూఢిల్లీ: కేన్సర్‌ చికిత్సల్లో వినియోగించే నాన్‌ షెడ్యూల్డ్‌ విభాగంలోని 42 ఔషధాలను ధరల నియంత్రణల విధానంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఔషధాల విక్రయ ధరలపై 30 శాతం మార్జిన్‌ను గరిష్ట పరిమితిగా విధించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జాతీయ ఫార్మాస్యూటికల్‌ ధరల నిర్ణాయక మండలి (ఎన్‌పీపీఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఔషధ విభాగం తన ప్రకటన ద్వారా తెలియజేసింది.

‘‘ఔషధ చట్టం 2013లోని పారాగ్రాఫ్‌ 19 కింద ప్రభుత్వం ఇకపై వ్యాపార మార్జిన్‌ను 30 శాతంగా నిర్ణయించింది. ఈ మేరకు నాన్‌ షెడ్యూల్డ్‌ విభాగంలోని 42 ఔషధాలపై మార్జిన్‌ను ఖరారు చేయాలని తయారీదారులకు ఆదేశించడం జరిగింది’’ అని ఫార్మాస్యూటికల్స్‌ విభాగం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. 105 బ్రాండ్ల ధరలు 85% వరకు తగ్గనున్నాయని, ఫలితంగా వినియోగదారులకు రూ.105 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని తెలిపింది.   
 

మరిన్ని వార్తలు