15% కార్పొరేట్‌ పన్ను గడువు పొడిగింపు!

9 Jun, 2020 04:07 IST|Sakshi

తక్కువ పన్ను రేటుతో లబ్ధి పొందాలి

కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌

న్యూఢిల్లీ: తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలకు 15 శాతం కార్పొరేట్‌ పన్ను అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించగా.. ఇందుకు సంబంధించిన గడువు పొడిగింపును పరిశీలించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధి కనిష్టాలకు పడిపోవడంతో పెట్టుబడులకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి.. అదే విధంగా 2019 అక్టోబర్‌ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య తయారీ రంగంలో ఏర్పాటయ్యే కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ కేంద్ర సర్కారు నిర్ణయాలు తీసుకుంది. ‘‘మేము ఏం చేయగలమన్నది చూస్తాం. నూతన పెట్టుబడులపై 15 శాతం కార్పొరేట్‌ పన్ను నుంచి పరిశ్రమ ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను.

దీంతో 2023 మార్చి 31 వరకు ఇచ్చిన గడువును పొడిగించడాన్ని పరిగణనలోకి తీసుకుంటాము’’ అని సీతారామన్‌ ఫిక్కీ సభ్యులను ఉద్దేశించి చెప్పారు. దేశీయ పరిశ్రమలకు, ఆర్థిక రంగ ఉద్దీపనానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. కోవిడ్‌–19 అత్యవసర రుణ సదుపాయం కేవలం ఎంఎస్‌ఎంఈలకే కాకుండా అన్ని కంపెనీలకు అందుబాటులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

లిక్విడిటీ సమస్య లేదు: వ్యవస్థలో లిక్విడిటీ తగినంత అందుబాటులో ఉందని, ఇందుకు సం బంధించి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని సీతారామన్‌ చెప్పారు. అన్ని ప్రభుత్వ విభాగాలకూ బకాయిలు తీర్చేయాలని చెప్పినట్టు పేర్కొన్నారు. జీఎస్‌టీ తగ్గింపుపై నిర్ణయం జీఎస్‌టీ కౌన్సిల్‌దేనని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు