రక్షణ రంగంలోకి మరిన్ని ఎఫ్‌డీఐలు!

6 Jun, 2017 00:33 IST|Sakshi
రక్షణ రంగంలోకి మరిన్ని ఎఫ్‌డీఐలు!

నిబంధనల సరళీకరణపై కేంద్రం దృష్టి
పరిశ్రమ వర్గాలతో సమాలోచనలు

న్యూఢిల్లీ: రక్షణ రంగంలోకి మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) తీసుకురావడంపై కేంద్రం దృష్టి సారించింది. గతంలో కొంత మేర నిబంధనలు సరళీకరించినప్పటికీ ఆశించిన ఫలితం లేకపోవడంతో, నిబంధనలను మరింత సులభతరం చేయాలనుకుంటోంది. ఈ దిశగా రక్షణ శాఖ ఓ సమావేశాన్ని నిర్వహించింది. దీనిలో సీఐఐ, ఫిక్కీ తదితర పారిశ్రామిక సంఘాలు సైతం పాల్గొన్నాయి. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఏం  చేస్తే బావుంటుందని అధికారులు కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏ దేశంలో అయినా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు విదేశీ ఇన్వెస్టర్లు హామీతో కూడినా ఆర్డర్లను కోరుకుంటారని పరిశ్రమ వర్గాలు ఈ సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

2016లో కేంద్రంలోని మోదీ సర్కారు రక్షణ సహా పలు రంగాల్లో ఎఫ్‌డీఐలకు సంబంధించి నిబంధనలను సరళీకరించింది. ప్రస్తుతం ఈ రంగంలో ఆటోమేటిక్‌ మార్గంలో (ఎటువంటి అనుమతులు లేకుండా) విదేశీ ఇన్వెస్టర్లు 49 శాతం వరకూ పెట్టుబడులకు పెట్టేందుకు అనుమతి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతి మేరకు 100 శాతం వరకు పెట్టుబడులకు అవకాశం కల్పించారు. కానీ, వాస్తవంగా చూస్తే 2000 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రక్షణ రంగంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలు కేవలం రూ.25 కోట్లు మాత్రమే. మన దేశంలో రక్షణ ఉత్పత్తులకు ప్రభుత్వం ఒక్కటే కొనుగోలుదారుగా ఉంది.

దేశం నుంచి రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అధిక నియంత్రణలు అడ్డుపడుతున్నాయి. అదే సమయంలో మన దేశం 70 శాతం మిలటరీ ఉత్పత్తులను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం గత నెల్లోనే ఓ విధానాన్ని ప్రకటించింది. ప్రైవేటు కంపెనీలు విదేశీ సంస్థలతో కలసి సబ్‌మెరైన్లు, ఫైటర్‌ జెట్స్‌ వంటి వాటిని నిర్మించేందుకు అవకాశం కల్పించింది.

మరిన్ని వార్తలు