గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌

26 Jan, 2018 19:38 IST|Sakshi

తొలిసారి గృహ కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన కింద క్రెడిట్‌ లింక్‌ సబ్సిడీ స్కీమ్‌(సీఎల్‌ఎస్‌ఎస్‌) వాడుకుని గృహాలు కొనుగోలు చేసే వారికి జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది. కుటుంబ ఆదాయం వార్షికంగా రూ.18 లక్షల వరకు ఉండి.. తొలిసారి గృహాన్ని కొనుగోలు చేసే వారు రూ.2.7 లక్షల వరకు ప్రయోజనానికి అర్హులవుతారని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రిపోర్టు చేసింది. అయితే సీఎల్‌ఎస్‌ఎస్‌కు అర్హులు కాని వారు, 12శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేనని తెలిపింది.  క్రెడిట్‌ లింక్‌ సబ్సిడీ స్కీమ్ కింద 150 చదరపు మీటర్ల వరకు కార్పెంట్‌ ఏరియాను వారు కొనుగోలు చేసుకోవచ్చు. కార్పెట్‌ ఏరియా అంటే గోడల వెలుపల ఉన్న ప్రాంతం. గత నవంబర్‌లోనే సీఎల్‌ఎస్‌ఎస్‌ కింద అర్హులైన గృహాలకు కార్పెట్‌ ఏరియాను పెంచడాన్ని కేబినెట్‌ ఆమోదించింది. ఇది కేవలం మధ్యతరగతి ఆదాయ వర్గం(ఎంఐజీ) వారికే. 

మధ్యతరగతి ఆదాయ వర్గాన్ని కూడా కేంద్రం రెండు కేటగిరీలుగా వర్గీకరించింది. రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయమున్న వారిని ఎంఐజీ-1 కేటగిరీ కిందకి తెచ్చి... వీరికి రూ.9 లక్షల వరకు రుణం అందిస్తున్నారు. వీరికి 4 శాతం ఇంటరెస్ట్‌ సబ్సిడీ అందుబాటులో ఉంది. రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఆదాయమున్న వారిని ఎంఐజీ-2 కేటగిరీ కిందకి తెచ్చి.. వీరికి రూ.12 లక్షల రుణం అందిస్తున్నారు. వీరికి 3 శాతం ఇంటరెస్ట్‌ సబ్సిడీని అందిస్తుంది. 2022 వరకు పట్టణ ప్రాంతంలోని పేద వారందరికీ గృహాలు అందించడమే లక్ష్యంగా ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన పనిచేస్తోంది.
 

మరిన్ని వార్తలు