సగానికి తగ్గిన పసిడి ప్రీమియం

3 Jun, 2014 00:33 IST|Sakshi
సగానికి తగ్గిన పసిడి ప్రీమియం

ముంబై/ సింగపూర్: బంగారం దిగుమతులపై ఆంక్షలను మోడీ ప్రభుత్వం సడలిస్తుందన్న అంచనాలతో పసిడిపై ప్రీమియం ఈ వారంలో సగానికి తగ్గిపోయింది. ఔన్సు (31.1 గ్రాములు) పుత్తడిపై ప్రీమియం గత వారంలో 80-90 డాలర్లుండగా ఇపుడది 30-40 డాలర్లకు క్షీణించిందని డీలర్లు తెలిపారు. ధరలు తగ్గినప్పటికీ ఇతర ఆసియా దేశాల్లో బంగారానికి డిమాండు పెరగలేదు. భారీగా పెరిగిన కరెంటు అకౌంటు లోటును అదుపు చేసేందుకు కేంద్రం గతేడాది జూలై నుంచి బంగారం దిగుమతులపై తీవ్ర ఆంక్షలు విధించింది.
 
 దిగుమతి చేసుకున్న పసిడిలో 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయాలనే నిబంధన (80:20 ఫార్ములా) కూడా పెట్టింది. కరెంటు అకౌంటు లోటు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో దిగుమతులపై ఆంక్షలను కొత్త ప్రభుత్వం సడలించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఆంక్షలను సడలించడానికి ముందు విధాన, ఆర్థికాంశాలనే కాకుండా ప్రజలు, వ్యాపారుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని మోడీ చెప్పారు.
 
 పసిడి దిగుమతులకు స్టార్ ట్రేడింగ్ హౌస్‌లను అనుమతిస్తూ రిజర్వు బ్యాంకు ఇటీవలే ఆంక్షలు సడలించింది. త్వరలోనే మరిన్ని సడలింపులు ఉంటాయనే అంచనాతో ప్రీమియంలు భారీగా తగ్గిపోయాయని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వ్యాపారుల సమాఖ్య డెరైక్టర్ బచ్‌రాజ్ బామాల్వా తెలిపారు. 80:20 ఫార్ములాను పూర్తిగా తొలగించే వరకు ప్రీమియంలు ఇక తగ్గబోవని భావిస్తున్నట్లు చెప్పారు.
 
 ఏమిటీ ప్రీమియం..: బంగారం దిగుమతి ధరతో పోలిస్తే ఏడాదికాలంగా భారత్‌లో ఎక్కువ రే టు పలుకుతోంది.  ఈ అధిక ధరనే ప్రీమియంగా పరిగణిస్తాం. మన దేశంలోకి దిగుమతి చేసుకునే సంస్థలే ఈ ప్రీమియంను వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 1245 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ధరకు 11.5 శాతం దిగుమతి సుంకాలు కలిపితే 1388 డాలర్ల చొప్పున ఇక్కడి మార్కెట్లో విక్రయించాలి. కానీ దీనికి మరో 30 డాలర్లను ప్రీమియంగా కలుపుకొని 1418 డాలర్ల వరకూ దిగుమతి సంస్థలు ఇక్కడి బులియన్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దాంతో ఇక్కడ 10 గ్రాముల ధరపై అదనంగా రూ. 600 భారం వినియోగదారులపై పడుతోంది. గతేడాది ఈ ప్రీమియం రూ. 3,000 వరకూ కూడా చేరింది. తదుపరి క్రమేపీ తగ్గుతూ వచ్చింది.  
 
 బంగారం, వెండిపై దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు
 న్యూఢిల్లీ: ప్రభుత్వం సోమవారం బంగారం, వెండి దిగుమతులపై టారిఫ్ విలువను తగ్గించింది. పసిడి 10 గ్రాముల టారిఫ్ విలువను 424 డాలర్ల నుంచి 408 డాలర్లకు తగ్గించింది. వెండి కేజీ విషయంలో ఈ విలువను 650 డాలర్ల నుంచి 617 డాలర్లకు తగ్గించింది. అంతర్జాతీయంగా ధరల బలహీన ధోరణి దీనికి కారణం.

టారిఫ్‌లను తగ్గిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది.  విలువను తక్కువచేసి చూపేందుకు(అండర్ ఇన్వాయిసింగ్) ఆస్కారం లేకుండా చేయడమే దీని ప్రధానోద్దేశం. సహజంగా 5 శాతం మేర మార్పు ఉంటే స్పాట్ మార్కెట్‌లో ఈ విలువ ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణ.

>
మరిన్ని వార్తలు