విమానాల్లో మొబైల్‌ సేవలపై కమిటీ.. 

5 Jan, 2019 01:08 IST|Sakshi

న్యూఢిల్లీ: విమానాల్లోనూ, నౌకల్లోనూ మొబైల్‌ సేవలను (ఐఎఫ్‌ఎంసీ) మూడు నెలల వ్యవధిలోగా అందుబాటులోకి తెచ్చే అంశంపై అంతర్‌–మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. వీటి అమల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై ఈ కమిటీ ప్రతి 15 రోజులకొకసారి సమావేశం అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘ఎయిర్‌లైన్స్, షిప్పింగ్‌ కంపెనీలు, టెలికం ఆపరేటర్లు, ప్రభుత్వంలోని వివిధ శాఖల వర్గాలతో శుక్రవారం సమావేశం జరిగింది. ఐఎఫ్‌ఎంసీ సర్వీసులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చే దిశగా అంతర్‌–మంత్రిత్వ శాఖల గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సర్వీసులు సజావుగా అమలయ్యే క్రమంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీ ప్రతి 15 రోజులకోసారి సమావేశం అవుతుంది‘ అని వివరించాయి. మూడు నెలల్లోగా సర్వీసులు అందుబాటులోకి తేవొచ్చని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు పేర్కొన్నాయి. పది ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఈ సేవలు ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని స్పైస్‌జెట్‌ తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో శాటిలైట్‌ బ్యాండ్‌విడ్త్‌ చార్జీలు 7–8 రెట్లు అధికంగా ఉంటున్నాయని, దీంతో రెండు గంటల విమాన ప్రయాణంలో కాల్‌ చార్జీలు 30–50 రెట్లు అధికంగా ఉండే (సుమారు రూ. 700–1000 దాకా) అవకాశముందని బ్రాడ్‌బ్యాండ్‌ టెక్నాలజీ సంస్థ హ్యూస్‌ ఇండియా పేర్కొంది.   

>
మరిన్ని వార్తలు