బ్లూచిప్‌ పీఎస్‌యూల్లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌!

14 Jan, 2020 06:25 IST|Sakshi

కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: నాల్కో, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ వంటి బ్లూచిప్‌ పీఎస్‌యూల్లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో షేర్లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లక్ష్య సాధన కష్టతరం కానుండటంతో నాల్కో, కోల్‌ ఇండియా వంటి మంచి పనితీరు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఓఎఫ్‌ఎస్‌ను చేపట్టాలని డిజిన్వెస్ట్‌మెంట్‌ విభాగం భావిస్తోంది.  

నేషనల్‌ అల్యూమినియమ్‌ కంపెనీ(నాల్కో), కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, ఎన్‌ఎమ్‌డీసీ, ఎన్‌బీసీసీ(ఇండియా), భారత్‌ ఎలక్ట్రానిక్స్, నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్, హిందుస్తాన్‌ కాపర్‌.. ఈ కంపెనీలు ఓఎఫ్‌ఎస్‌ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల్లో ప్రభుత్వానికి 52–82 శాతం రేంజ్‌లో వాటాలున్నాయి. అయితే ఈ కంపెనీల ఓఎఫ్‌ఎస్‌కు ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు మార్కెట్‌ స్థితిగతులు బాగా ఉంటేనే ఈ షేర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి దండిగా రాబడి రాగలదు.   బీపీసీఎల్, ఎయిర్‌ ఇండియాల వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తికాకవపోచ్చు. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యసాధనలో రూ.87,000 కోట్ల మేర కోత పడనున్నది.

మరిన్ని వార్తలు