గ్రామీణ డాక్‌ సేవక్‌ల వేతనం పెంపు

6 Jun, 2018 17:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  తపాలా శాఖ ఉద్యోగులకు  కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.  గ్రామీణ డాక్‌ సేవక్‌ల వేతనాలను పెంచుతూ  కేంద్ర  క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది.  క్యాబినెట్‌ సమావేశం అనంతరం ఈ విషయాన్ని కేంద్ర  టెలికాం శాఖామంత్రి మనోజ్‌ సిన్హా  మీడియాకు తెలిపారు.  గ్రామీణ డాక్‌ సేవక్‌ల బేసిక్‌ సాలరీ  గరిష్టంగా 14,500 రూపాయలుగా  నిర్ణయించినట్టు చెప్పారు.  తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 2.6లక్షలమంది గ్రామీణ డాక్‌ సేవక్‌లు  లబ్ది పొందనున్నారు.

గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌)లకు సంబంధించి ఇప్పటివరకూ 2,295 రూపాయల వేతనం పొందుతున్న వారు ఇకపై నెలకు 10వేల రూపాయల చొప్పున, రూ. 2,775 పొందుతు​న్నవారు ఇకపై 12,500 రూపాయలు, రూ.4,115 పొందుతున్న జీడీఎస్‌లకు ఇకపై నెలకు 14,500 రూపాయల బేసిక్‌ పే చెల్లించనున్నామని మనోజ్ సిన్హా తెలిపారు. దీనికి అదనంగా రిస్క్‌ అండ్‌ హార్డ్‌షిప్‌ అలవెన్సులను తొలిసారి అందించనున్నట్టు చెప్పారు. ఈ సవరించిన వేతనాలు జనవరి1, 2016 నుంచి వర్తిస్తాయని, వీటిని బకాయిలతో సహా చెల్లిస్తామన్నారు. అలాగే మూడు షిప్ట్‌ల్లో కాకుండా ఇకపై వీరు రెండు షిప్ట్‌ల్లో మాత్రమే పనిచేయనున్నారని కేంద్రమంత్రి వెల్లడించారు. అంతేకాదు జీడీఎస్‌లపై ఆధారపడిన వారికుద్దేశించిన పరిహార నియామకాలను కూడా కేబినెట్ ఆమోదించిందన్నారు. ఇప్పటివరకూ ఈ సదుపాయం ఈ ఉద్యోగులకు అందుబాటులో లేదని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు