ఉల్లి ధరలపై ఊరట

9 Nov, 2019 18:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆకాశన్నంటిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర మరిన్ని చర్యల్ని చేపట్టింది. రిటైల్ మార్కెట్లో కిలోకుసుమారు రూ.100 వరకు పెరిగిన నేపథ్యంలో ఒక లక్ష టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్నికేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ట్వీటర్‌  ద్వారా శనివారం పేర్కొన్నారు. ధరలను నియంత్రించడానికి లక్ష టన్నుల ఉల్లిపాయను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని  నవంబర్ 15, డిసెంబర్ 15 మధ్య కాలంలో ఉల్లిపాయలను దిగుమతి చేసుకుని దేశీయ మార్కెట్లో పంపిణీ చేయడానికి ఎంఎంటీసీని కోరినట్లు ఆయన తెలిపారు. దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను దేశవ్యాప్తంగా సరఫరా చేయాలని నాఫెడ్‌ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

ప్రభుత్వ యాజమాన్యంలోని వాణిజ్య సంస్థ ఎంఎంటిసి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటుందనీ, దేశీయ మార్కెట్లో కీలకమైన నాఫెడ్ వీటిని సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు. శనివారం జరిగిన కార్యదర్శుల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు  చెప్పారు. 

మరిన్ని వార్తలు