ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు

6 Jul, 2019 02:40 IST|Sakshi

న్యూఢిల్లీ: సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) రుణ వితరణ పరంగా సమస్యల్లేకుండా చూసేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం అందించనున్నట్టు బడ్జెట్‌ ప్రతిపాదనలు చూస్తే అర్థం అవుతోంది. పీఎస్‌బీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, ఆర్థిక రంగ ప్రేరణకుగాను వాటికి మరో రూ.70,000 కోట్ల నిధుల సాయాన్ని ప్రకటిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. బ్యాంకులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, ఆన్‌ లైన్‌ లో వ్యక్తిగత రుణాలను, ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలను అందించాలని మంత్రి సూచించారు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకు కస్టమర్, ఇతర అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలను అందుకునే విధంగా ఉండాలన్నారు.  

ఖాతాదారుల అనుమతితోనే....
‘‘ఖాతాదారులకు వారి ఖాతాల్లో ఇతరులు చేసే డిపాజిట్ల విషయంలో ప్రస్తుతం పూర్తి నియంత్రణ లేదు. ఖాతాదారుల అనుమతితోనే ఇతరులు డిపాజిట్‌ చేసేలా  ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పీఎస్‌బీల్లో గవర్నెన్స్‌ బలోపేతం చేసేందుకు సంస్కరణలు కూడా తీసుకొస్తాం’’ అని మంత్రి చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య విలీనాల ద్వారా ఇప్పటికి 8 బ్యాంకులను తగ్గించినట్టు ప్రకటించారు.  

బ్యాంకులకు అదనంగా 1.34 లక్షల కోట్లు
వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్య నేపథ్యంలో బ్యాంకులకు అదనంగా రూ.1.34 లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ ముందుకు వచ్చింది. ఇది ఎన్‌బీఎఫ్‌సీలకు రుణ కల్పనకు దోహదం చేస్తుంది.

మరిన్ని వార్తలు