ఇంటి వద్దకే పెట్రోల్, సీఎన్‌జీ: ప్రధాన్‌

30 May, 2020 04:07 IST|Sakshi

న్యూఢిల్లీ: డీజిల్‌ను ఇంటి వద్దకే డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, పెట్రోల్, సీఎన్‌జీలను కూడా కస్టమర్ల ఆర్డర్‌పై వారి ఇంటికే తీసుకెళ్లి అందించే ప్రతిపాదన ఉన్నట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. అన్ని రకాల ఇంధనాలు.. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ ఒకే చోట లభించే విధంగా నూతన ఇంధన రిటైల్‌ నమూనాను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల పరిధిలో 56 నూతన సీఎన్‌జీ స్టేషన్లను ప్రారంభించే కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో వినియోగదారులు ఇంటి వద్దకే ఇంధనాలను తెప్పించుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుందన్నారు. 2018 సెప్టెంబర్‌ నుంచే ఎంపిక చేసిన కొన్ని పట్టణ ప్రాంతాల్లో డీజిల్‌ను మొబైల్‌ వ్యాన్‌ ద్వారా ఐవోసీ డెలివరీ చేస్తోంది. అయితే, పెట్రోల్, సీఎన్‌జీలకు మండే స్వభావం ఎక్కువ కనుక వీటి డోర్‌ డెలివరీలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

>
మరిన్ని వార్తలు