నల్లధనంపై పన్ను చెల్లింపు గడువు పొడిగింపు!

8 Jul, 2016 00:44 IST|Sakshi
నల్లధనంపై పన్ను చెల్లింపు గడువు పొడిగింపు!

న్యూఢిల్లీ: నల్లధనం స్వచ్చంధ  వెల్లడికి సంబంధించి పన్ను చెల్లింపు గడువును పొడిగించే అవకాశం ఉందని అత్యున్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. దఫాల వారీగా పన్ను చెల్లింపు వెసులుబాటు కల్పించాలని పరిశ్రమ చేసిన విజ్ఞప్తిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2016-17 బడ్జెట్ ప్రతిపాదన మేరకు 4 నెలలు అమల్లో ఉండే ఈ పథకం జూన్ 1వ తేదీన ప్రారంభమైంది. సెప్టెంబర్ 30వ తేదీతో ముగి యనుంది. దీని ప్రకారం వన్‌టైమ్ విండో- 2016 ఇన్‌కమ్ డిక్లరేషన్ స్కీమ్ (ఐడీఎస్) కింద జూన్-సెప్టెంబర్ మధ్య ప్రకటించిన ఆదాయం పై 45% పన్ను, జరిమానాను నవంబర్‌లోపు చెల్లించాల్సి ఉంది. తద్వారా ప్రాసిక్యూషన్, కఠిన శిక్షల నుంచి మినహాయింపు పొందే వీలుంది. 

 నవంబర్‌లో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సంబంధ సమస్యలు ఉండే వీలున్నందున, ఐడీఎస్ పన్ను చెల్లింపు గడువును పెంచాలని ఇటీవల ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నిర్వహించిన ఒక సమావేశంలో పారిశ్రామిక ప్రతినిధులు, సీఏలు, పన్ను సంబంధ వృత్తి నిపుణులు విజ్ఞప్తి చేశారని దీనిని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఉన్నతాధికారి తెలిపారు.  రెసిడెంట్, నాన్-రెసిడెంట్ వ్యక్తులకు వర్తించే ఈ పథకం గురించి ఇంకా పలు సందేహాలు, ప్రశ్నలు వస్తున్నాయని, ఈ సందేహాలను వ్యక్తిగతంగా నివృత్తి చేస్తున్నామని అధికారి తెలిపారు. ఈ స్కీమ్ విషయంలో పురోగతిని ప్రతివారం పన్ను అధికారులతో రెవెన్యూ కార్యదర్శి హాస్‌ముఖ్ ఆదియా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు