బంగారంపై మోదీ సర్కార్‌ షాకింగ్‌ నిర్ణయం

30 Oct, 2019 14:18 IST|Sakshi

బంగారం లెక్కలు చెప్పాల్సిందే..

పరిమితికి మించి ఉంచుకుంటే.. తప్పదు జరిమానా

త్వరలోనే గోల్డ్‌ బోర్డు

సాక్షి,న్యూఢిల్లీ : కేంద్రం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది.  తద్వారా ప్రపంచంలో బంగారం వినియోగంలో రెండవస్థానంలో ఉన్న దేశీయ వినియోగదారులకు షాకివ్వనుంది. వినియోగదారుల వద్ద లెక్కల్లోకి బంగారాన్ని వెలికి తీసేందుకు, నల్లధనాన్ని నిరోధించే లక్ష్యంతో మోదీ సర్కార్‌ భారీ ప్రణాళికలే రచిస్తోంది. వినియోగదారుల వద్ద బంగారాన్నిచట్టబద్ధం చేసే లక్ష్యంతో ఒక ప్రత్యేక పథకానికి శ్రీకారం చుడుతోందని ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థికమంత్రిత్వ శాఖ తుది మెరుగులు దిద్దుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక గోల్డ్‌బోర్డు పేరుతో ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయనుంది. 

బంగారం నిల్వను ఒక నిర్దిష్ట పరిమితికి కట్టడి చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయనుంది. దీని ప్రకారం ఒక వ్యక్తి లేదా కుటుంబం బంగారం కలిగివుంటే పరిమితిని నిర్ణయిస్తారు. నిర్దేశించిన పరిమితికి మించి కలిగి ఉన్నవారికి భారీ జరిమానాలు విధిస్తారు.  అయితే  వివాహిత మహిళలను ఈ పథకం నుంచి మినహాయించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

అంతేకాదు ప్రభుత్వం త్వరలో బంగారం కోసం మాఫీ పథకాన్ని ప్రకటించవచ్చు. ఆదాయపు పన్నుమాఫీ పథకం మాదిరిగానే, ఈ బంగారంపై కూడా  పన్ను మాఫీ పథకం ఒక నిర్దిష్ట కాలానికి అందుబాటులో ఉంటుంది.  సరైన బిల్లులు లేకుండా బంగారంతో పట్టుబడిన వ్యక్తులు భారీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  ఈ పథకంపై  పూర్తి వివరాలు అధికారికంగా  వెల్లడికావాల్సి వుంది. 

గోల్డ్ బోర్డు
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ప్రతినిధులతో ‘గోల్డ్ బోర్డ్’ ఏర్పాటు చేయనున్నారు. ఆర్థిక వ్యవహారాల శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా తయారు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గోల్డ్‌ బోర్డు సిద్ధం కానుంది. కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా ఉండటానికి, బంగారు హోల్డింగ్స్‌ను ఆర్థిక ఆస్తిగా అభివృద్ధి చేయడానికి ప్రతి సంవత్సరం ఈ ప్రతిపాదనలను సమీక్షిస్తారు. ఈ కొత్త ప్లాన్‌తో పాటు, ప్రస్తుత సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చడానికి పునరుద్ధరించనున్నారు. నిజానికి ఈనెల(అక్టోబర్) 2వ వారంలోనే దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి వుంది. అయితే మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర ఎన్నికల కారణంగా వాయిదా పడింది. కాగా రెండేళ్ల క్రితమే ప్రభుత్వ థింక్-ట్యాంక్ నీతి ఆయోగ్ ఈ మేరకు సూచించడం గమనార్హం. 

ప్రభుత్వ సావరిన్ బాండ్ పథకం కింద వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు నాలుగు కిలోల వరకు బంగారాన్ని డీమాట్ రూపంలో కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. అదే ట్రస్టులకయితే 20 కిలోల బంగారం కొనుగోలుకు అనుమతి ఉంది.  దీనికి సంబంధించిన ఆరవ సిరీస్ అక్టోబర్ 25న ముగియగా,  ఏడవ సిరీస్ డిసెంబర్ 2- 6 మధ్య  ప్రారంభం కానుంది.  

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు