ఇలా చేస్తే రూ. 1 కోటి దాకా నజరానా

5 Feb, 2020 10:27 IST|Sakshi

జీఎస్‌టీని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్లాన్‌

బిల్లు తీసుకున్న వినియోగదారులకు  బంపర్‌ ఆఫర్‌

లాటరీ ద్వారా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి  బహుమతి

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. కొన్న ప్రతీ వస్తువుకు విక్రేతల నుంచి కచ్చితంగా బిల్లు తీసుకునేలా కొనుగోలుదారులను ప్రోత్సహించే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా బహుమతులు ఇచ్చేలా లాటరీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) సభ్యుడు జాన్ జోసెఫ్ ఈ విషయాలు తెలిపారు.

జీఎస్‌టీ కింద తీసుకునే ప్రతీ బిల్లుతోనూ కస్టమర్లు.. లాటరీలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. "కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకే లాటరీ బిల్లు భారీ స్థాయిలో పెడుతున్నాం. కాబట్టి బిల్లు తీసుకోకుండా 28 శాతం (గరిష్ట జీఎస్‌టీ) పొదుపు చేయడం కన్నా రూ. 10 లక్షలో లేదా రూ. 1 కోటి దాకా గెలవడానికి అవకాశం ఉంటుంది కదా అని కొనుగోలుదారులు ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది. పన్నుల చెల్లింపుపై కొనుగోలుదారుల ఆలోచనా ధోరణులను మార్చేందుకు ఇలాంటివి ఉపయోగపడగలవు" అని ఆయన పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం లాటరీలో పాల్గొనాలంటే కనీస బిల్లు మొత్తం ఉంటుంది. వినియోగదారుల సంక్షేమ నిధి నుంచి లాటరీ మొత్తాన్ని చెల్లిస్తారు. కొనుగోలుదారుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేసి లాభాలు ఆర్జించిన వ్యాపార సంస్థలపై విధించిన జరిమానాలను ఈ నిధికి బదలాయిస్తున్నారు. 

మరిన్ని వార్తలు