ఇక ఇంటి వద్దకే పెట్రోల్‌

22 Apr, 2017 07:26 IST|Sakshi
ఇక ఇంటి వద్దకే పెట్రోల్‌

► బుక్‌ చేసుకుంటే పెట్రోలియం ఉత్పత్తుల డోర్‌ డెలివరీ 
► కేంద్ర చమురు శాఖ యోచన  
► మార్కెటింగ్‌ కంపెనీలను ఆదేశించే అవకాశం  


న్యూఢిల్లీ: ఇకపై.. పెట్రోల్‌ అయిపోతే బంకుల దాకా బండిని మోసుకెళ్లడమో లేదా బాటిల్‌ పట్టుకుని పెట్రోల్‌ బంకుకు పరిగెత్తడమో చేయక్కర్లేదు. ఎందుకంటే.. ఆన్‌లైన్లో బుక్‌ చేసుకుంటే పెట్రోల్, డీజిల్‌ వంటి పెట్రోలియం ఉత్పత్తులను ఇంటి దగ్గరే అందుబాటులోకి తెచ్చే ప్రతిపాదనపై కేంద్ర పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ దిశగా పెట్రోలియం ఉత్పత్తుల డోర్‌–టు–డోర్‌ డెలివరీ సర్వీసులు అందించేలా ఈ–కామర్స్‌ విధానాన్ని పరిశీలించాలంటూ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) వంటి చమురు మార్కెటింగ్‌ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ తరహా విధానంతో వినియోగదారులకు పెట్రోల్‌ బంకుల్లో బారులు తీరడం, సమయం వృ«థా కావడం వంటి సమస్యలు తగ్గగలవని చమురు శాఖ పేర్కొంది. ఇటు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇది అటు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కూడా తోడ్పడగలదని భావిస్తున్నారు. మే 14 నుంచి పలు రాష్ట్రాల్లో బంకులను ఆదివారం మూసి ఉంచాలని బంకు ఓనర్లు యోచిస్తున్న నేపథ్యంలో తాజా ఆన్‌లైన్‌ బుకింగ్, డోర్‌ డెలివరీ విధానం ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.

బంకులకు రోజూ 3.5 కోట్ల మంది: దేశీయంగా 2016–17 ఆర్థిక సంవత్సరంలో 23.8 మిలియన్‌ టన్నుల పెట్రోల్, 76 మిలియన్‌ టన్నుల డీజిల్‌ వినియోగం జరిగింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్‌ వినియోగం 21.8 మిలియన్‌ టన్నులు, డీజిల్‌ వినియోగం 74.6 మిలియన్‌ టన్నులే. ఇక నివేదికల ప్రకారం .. వాహనాల్లో ఇంధనం నింపుకోవడం కోసం ప్రతి రోజు 3.5 కోట్ల మంది వాహనదారులు పెట్రోల్‌ బంకులకు వస్తుంటారని అంచనా. ఇక గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి.. తృతీయ శ్రేణి పట్టణాల్లోనైతే బంకుల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి.. నిర్ధిష్ట సమయాల్లో పెట్రోల్‌ బంకుల్లో రద్దీ భారీగా పెరిగిపోతుంది. పెట్రోల్‌ బంకుల్లో ఏటా రూ. 2,500 కోట్ల విలువ చేసే లావాదేవీలు జరుగుతుంటాయి.

ఇందులో సింహభాగం నగదే ఉంటోంది. అదే ఆన్‌లైన్‌ డెలివరీ ఆప్షన్‌ గానీ అందుబాటులోకి తెస్తే.. నగదు లావాదేవీల పరిమాణం గణనీయంగా తగ్గొచ్చని అంచనా. పెద్ద నోట్ల రద్దు దరిమిలా ఎలక్ట్రానిక్‌ లావాదేవీలను ప్రోత్సహించడంపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దృష్టి పెట్టారు. పెట్రోల్‌ బంకుల్లో ఇంధన కొనుగోళ్ల కోసం క్రెడిట్‌/ డెబిట్‌ కార్డులు లేదా ఈ–వాలెట్లతో చెల్లింపులు జరిపే వారికి 0.75 శాతం డిస్కౌంటు ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆయన వెంటనే ఆమోదముద్ర వేశారు.

పెద్ద యెత్తున పెట్రోల్‌ బంకుల్లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) మెషిన్లను అందుబాటులోకి తేవడం జరిగింది. దేశవ్యాప్తంగా 86 శాతం బంకుల్లో డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు చేశారు. డీమోనిటైజేషన్‌ వ్యవధిలో పెట్రోల్‌ బంకుల్లో నగదు లావాదేవీలు రోజుకు రూ. 150 కోట్లకు తగ్గిపోయాయి. అయితే, రీమోనిటైజేషన్‌ ప్రక్రియ జరుగుతున్న కొద్దీ రోజువారీ నగదు లావాదేవీలు మళ్లీ రూ. 400 కోట్లకు పెరిగాయి.

మరిన్ని వార్తలు