జీఎస్టీ పరిధిలోని  వర్తకులకు బీమా

12 Jan, 2019 01:50 IST|Sakshi

రాయితీతో రుణాలు కూడా

కేంద్ర ప్రభుత్వం పరిశీలన  

 న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం పలు వర్గాలను ఆకట్టుకునే చర్యలను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొస్తోంది. జీఎస్టీ పరిధిలోని చిన్న వ్యాపారుల కోసం ఓ బీమా పథకాన్ని ప్రవేశపెట్టే ప్రతిపాదనను తాజాగా పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన తరహాలోనే, ప్రమాద బీమా కవరేజీని ఈ పథకం కింద వర్తకులకు అందించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వర్తకుల కోసం అమలు చేస్తున్న పథకం దీనికి ఆధారమని ఆ వర్గాలు తెలియజేశాయి. ఈ పథకం కింద చిన్న వర్తకులకు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా లభించవచ్చని తెలిపాయి. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఈ నెలాఖరులో బడ్జెట్‌ సమావేశాలకు ముందు దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి సురక్షా బీమా పథకం కింద ప్రస్తుతం రూ.2 లక్షల ప్రమాద బీమాను ఏడాదికి రూ.12 ప్రీమియానికే కేంద్ర ప్రభుత్వం ఆఫర్‌ చేస్తోంది. 18– 70 ఏళ్ల వయసు వారికి, సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలుం టే ఈ బీమా కవరేజీని పొందే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇక తమ వ్యాపారాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు, కంప్యూటరైజేషన్‌ చేసుకునేందుకు ముందుకు వచ్చే వ్యాపారులకు రాయితీతో రుణాలివ్వాలన్న ప్రతిపాదన ను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకురావచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఈ వర్గాలకు అధిక వడ్డీ రాయితీలు కూడా ఇవ్వొచ్చని పేర్కొన్నాయి. ప్రభుత్వం కొనుగోళ్లలో కొంత శాతాన్ని మహి ళా వ్యాపారుల నుంచే తీసుకునేలా రిజర్వ్‌ చేసే అవకాశం కూడా ఉందని తెలిపాయి.  

మరిన్ని వార్తలు