నిరంతర చర్చలతో ఆర్థిక వ్యవస్థకు ఊతం!

28 Nov, 2018 08:12 IST|Sakshi

ప్రభుత్వం, ఆర్‌బీఐలకు ఉపరాష్ట్రపతి సూచన  

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిరంతర చర్చలు కొనసాగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఆర్‌బీఐపై నియంత్రణసహా కీలక అంశాలకు సంబంధించి ఇటీవల కేంద్రం, ఆర్‌బీఐ మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి తాజా సూచన చేయడం గమనార్హం. భారత జౌళి పరిశ్రమ సమాఖ్య (సీఐటీఐ) వజ్రోత్సవాలను (60 సంవత్సరాలు) పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
 

వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలు కొందరి చెడ్డ వ్యక్తుల వల్ల ఉత్పన్నమవుతున్నాయి. అలాంటివారు పరిశ్రమకు ప్రతికూలంగా మారుతున్నారు.  
బ్యాంకులు ఎడాపెడా రుణాలు ఇచ్చేస్తున్నప్పుడు ఆర్‌బీఐ ఏమీ చేయలేదు. ఇప్పుడు ప్రతిదాన్నీ కఠినతరం చేయడం ప్రారంభించింది. లిక్విడిటీ పరమైన ఇబ్బందులకు ఇదీ ఒక కారణమే. ఆయా సమస్యల పరిష్కారానికి కేంద్రం, ఆర్‌బీఐ నిరంతరం మీడియా ద్వారా కాకుండా బోర్డ్‌ రూమ్‌లో చర్చలు జరపాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరు శక్తివంతులు? ఎవరిది తుది నిర్ణయం? అన్నది ప్రశ్నకాదు. ప్రజలు, వారి ప్రయోజనాలే తుది లక్ష్యం కావాలి. వ్యవస్థలన్నీ ప్రజల సంక్షేమానికేనన్న  విషయాన్ని గుర్తెరగాలి.  
భారత్‌ నిరంతరం సంస్కరణల ప్రక్రియ కొనసాగిస్తే, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని  ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆర్థికవేదిక వంటివి అభిప్రాయపడుతున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్‌ అత్యంత ఆకర్షణీయంగా ఉంది.  
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో జౌళి పరిశ్రమ వాటా ప్రస్తుతం 3 శాతంపైగా ఉంది. అత్యాధునిక సాంకేతికతతో దీనిని ఈ వాటాను మరింత పెంచాలి.  
జౌళి పరిశ్రమ వృద్ధికి  తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి  జూబిన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు