ఎన్‌పీఏల పరిష్కారంపై కొత్త నిబంధనలు!

4 Apr, 2019 05:53 IST|Sakshi

ఆర్‌బీఐ సర్క్యులర్‌ సుప్రీంకోర్టు కొట్టివేతపై నీతిఆయోగ్‌ ప్రకటన

కేంద్రం, సెంట్రల్‌ బ్యాంక్‌ రూపకల్పన చేస్తాయని వెల్లడి

కనీస ఆదాయ పథకాలకు భారీ వృద్ధి అవసరమని వ్యాఖ్య

ముంబై: మొండిబకాయిల పరిష్కారం విషయంలో కేంద్రం, బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)లు కొత్త నిబంధనలను తీసుకువస్తాయని నీతిఆయోగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమితాబ్‌ కాంత్‌ బుధవారం ఇక్కడ వెల్లడించారు. రుణ పునఃచెల్లింపుల్లో ఒక్కరోజు ఆలస్యం అయిన కంపెనీలపైనా దివాలా ప్రక్రియను ప్రారంభించాలని, 180 రోజుల లోపు రుణ పరిష్కారం కాకపోతే, ఆ అకౌంట్‌ను నేషనల్‌ లా కంపెనీ ట్రిబ్యునల్‌కు నివేదించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గత ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమితాబ్‌ కాంత్‌ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, మొండిబకాయిల సమస్య పరిష్కారానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సాక్‌ ఎక్సే్చంజీల ప్రపంచ సమాఖ్య సదస్సులో పాల్గొన్న ఆయన  పేరొన్న అంశాల్లో ముఖ్యమైనవి...

► కనీస ఆదాయ పథకాలపై ఇప్పుడు ప్రతిచోటా చర్చ జరుగుతోంది. అయితే ఇటువంటి పథకాల అమలుకు దేశం నిలకడగా అధిక వృద్ధి రేటును సాధించాల్సిన అవసరం ఉంది.  
► దేశ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల  వృద్ధికి సకాలంలో రుణ పునఃచెల్లింపులు, మొండిబకాయిల సత్వర పరిష్కారం అవసరం.
► వృద్ధిలేకపోతే పునఃపంపకం ఎలా? మీరు అధిక వృద్ధి సాధించకపోతే, మిగులు ఉండదు. అలాంటప్పుడు కనీస ఆదాయం వంటి పథకాలకు నిధులు కష్టం. ప్రస్తుతం దేశం 7 శాతం వృద్ధి సాధిస్తోంది. కనీస ఆదాయం వంటి పథకాల అమలుకు కనీసం 9 నుంచి 10 శాతం వృద్ధి అవసరం.  
► ప్రస్తుత స్థాయి నుంచి వృద్ధి పరుగుకు ఆర్థిక సంస్కరణలను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ప్రత్యేకించి తయారీ రంగం వృద్ధికి కృషి చేయాలి. ఇది ఎగుమతులు భారీగా పెరగడానికి దోహదపడుతుంది. కంపెనీల మార్జిన్లు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలూ మెరుగుపడతాయి.  
► దృష్టి సారించాల్సిన మరోరంగం వ్యవసాయం. సబ్సిడీలపై వ్యవసాయం పెరగదు. మార్కెట్‌ సంస్కరణల ద్వారానే ఇది సాధ్యం. 

మరిన్ని వార్తలు