ఆ నోట్ల డిపాజిట్‌కు అవకాశమివ్వం

31 Aug, 2017 17:37 IST|Sakshi
ఆ నోట్ల డిపాజిట్‌కు అవకాశమివ్వం
సాక్షి, న్యూఢిల్లీ : రద్దు అయిన పెద్ద నోట్లు రూ.500, రూ.1000 డిపాజిట్‌కు మరో కొత్త విండో తెరిచే ఉద్దేశ్యమేమీ లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టీకరించింది. ఈ నోట్ల డిపాజిట్‌కు అసలు అవకాశమివ్వబోమని తేల్చి చెప్పింది. ఆర్బీఐ తాజాగా రద్దయిన పెద్ద నోట్ల గణాంకాలు విడుదల చేయడంతో, తిరిగి రాని నోట్ల కోసం మరోసారి ఓ విండో తెరవాలంటూ కొంతమంది కోరుతున్నారు. గతేడాది నవంబర్‌ 8న ప్రభుత్వం ఈ నోట్లను రద్దు చేసింది. అనంతరం పలు గడువులు విధించిన ప్రభుత్వం, వీటిని తిరిగి బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి తీసుకుంది.
 
బుధవారం వెల్లడించిన ఆర్బీఐ వార్షిక రిపోర్టులో రద్దయిన పెద్ద నోట్లు దాదాపు అన్ని తమ వద్దకు వచ్చినట్టు తెలిపింది. 99 శాతం కరెన్సీ నోట్లు ఆర్బీఐ వద్ద జమయ్యాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కొంతమంది పాత రూ.500, రూ.1000 నోట్ల డిపాజిట్‌ కోసం ఓ కొత్త విండో తెరవాలని కోరుతున్నారు. అయితే ఈ సమయంలో ఎట్టిపరిస్థితులోనూ పాత నోట్ల డిపాజిట్‌కు కొత్త విండో తెరవడం కుదరదంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌.సి గర్గ్‌ చెప్పారు. ఇదే విషయాన్ని అంతకముందు ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు కూడా తెలిపింది.
 
సహేతుక కారణాలు చూపించే వారికోసం పాత నోట్ల డిపాజిట్‌కు ఓ విండో తెరవాలని సుప్రీంకోర్టు సూచించింది. కానీ ఇప్పుడు విండో తెరిస్తే, అది దుర్వినియోగం పాలయ్యే అవకాశముందని, అంతేకాక డీమానిటైజేషన్‌ ఉద్దేశ్యమే మారిపోతుందని ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు నివేదించింది.  ఆర్బీఐ ప్రకటన అనంతరం  రద్దయిన నోట్లన్నీ బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి వచ్చాయని భావిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అంచనావేసినంత తిరిగి బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి వచ్చిందని తాను భావిస్తున్నట్టు గర్గ్‌ చెప్పారు. ఎంతమంది ఎన్ని అంచనాలు విడుదల చేస్తున్నప్పటికీ, వెనక్కి రాని కరెన్సీ అంచనాల గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదన్నారు. 
మరిన్ని వార్తలు