కోల్‌ ఇండియా వాటా విక్రయం నేడు

31 Oct, 2018 00:37 IST|Sakshi

నేటి నుంచి ఆఫర్‌ ఫర్‌ సేల్‌

విక్రయ ధర రూ. 266

రిటైల్‌ ఇన్వెస్టర్లకు 5% డిస్కౌంట్‌

న్యూఢిల్లీ: కోల్‌ ఇండియాలో 3 శాతం వాటాను బుధవారం ప్రభుత్వం విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ఒక్కో షేర్‌ను రూ.266కు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధర మంగళవారం ముగింపు ధరతో పోలిస్తే 4 శాతం తక్కువ. రెండు రోజుల పాటు జరిగే ఈ వాటా విక్రయంలో బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్లు బిడ్‌లు దాఖలు చేయవచ్చు. రిటైల్‌ ఇన్వెస్టర్లు గురువారం ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.  

ప్రభుత్వ ఖజానాకు రూ.5,000 కోట్లు...
ఈ మూడు శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.5,000 కోట్లు సమకూరుతాయని అంచనా. ఓఎఫ్‌ఎస్‌ ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయితే మరో 6 శాతం వాటాను కూడా విక్రయించాలనేది ప్రభుత్వ ఆలోచన. మొత్తం 9 శాతం వాటా విక్రయం ద్వారా రూ.15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సమీకరిస్తుందని అంచనా. 

డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా 2015, జనవరిలో కేంద్రం కోల్‌ ఇండియాలో 10 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటా విక్రయం ద్వారా అప్పుడు రూ.23,000 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం కోల్‌ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 78.32% వాటా ఉంది. డిజిన్వెస్ట్‌మెంట్‌ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో కోల్‌ ఇండియా షేర్‌ 4% వరకూ పతనమై రూ.277 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు