దివాలా చర్యలకు 6 నెలల బ్రేక్‌!

24 Apr, 2020 07:54 IST|Sakshi

దివాలా చట్టానికి సవరణలు చేయనున్న కేంద్రం

న్యూఢిల్లీ : కరోనా కష్ట కాలంలో కార్పొరేట్‌ రుణ గ్రహీతలకు పెద్ద ఉపశమనం కల్పించే విధంగా దివాలా చట్టానికి సవరణలను కేంద్రం తీసుకురానుంది. కంపెనీలు తీసుకున్న రుణాలకు చెల్లింపులు చేయకపోతే దివాలా అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) చట్టంలోని నిబంధనల ప్రకారం నిర్ణీత కాలం తర్వాత అంటే 90 రోజుల అనంతరం ఎన్‌పీఏగా గుర్తించి దివాలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, లౌక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా కంపెనీలు పనిచేసే అవకాశం లేదు.

ఈ ప్రభావం చాలా కాలం పాటు కంపెనీలపై ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో.. కంపెనీలపై దివాలా చర్యలకు వీలు కల్పించే చట్టంలోని సెక్షన్‌ 7, 9, 10ను కొంతకాలం పాటు సస్పెండ్‌ చేసే విధంగా చట్టంలో కేంద్రం సవరణలు తీసుకురానున్నట్టు అధికార వర్గాల సమాచారం. దీంతో చెల్లింపులు చేయలేని కంపెనీల రుణాలను పునరుద్ధరించే వీలు బ్యాంకులకు ఏర్పడుతుంది. తొలుత ఆరు నెలల కాలానికి ఈ నిబంధనలను సస్పెండ్‌ చేసి, తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి కార్పొరేట్‌ రుణాల పునరుద్ధరణకు ఆర్‌బీఐ నిబంధనలు అనుమతించడం లేదు. దీంతో చెల్లింపుల్లో విఫలమైతే ఐబీసీ చట్టం కింద ఆయా రుణ ఖాతాల విషయంలో బ్యాంకులు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది.

లాక్‌డౌన్‌లో జాప్యాన్ని డిఫాల్ట్‌గా చూడవద్దు: సెబీ
మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కలిగి ఉన్న మనీ మార్కెట్, డెట్‌ సెక్యూరిటీలకు సంబంధించి లాక్‌డౌన్‌ కాలంలో అసలు, వడ్డీ చెల్లింపులు, కాల వ్యవధి పొడిగింపులను డిఫాల్ట్‌గా పరిగణించవద్దని వ్యాల్యుషన్‌ ఏజెన్సీలను సెబీ కోరింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్నందున మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సెబీ దృష్టికి రావడంతో ఈ పరిణామం జరిగింది. మరోవైపు రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియంకు ఆర్‌బీఐ అనుమతించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు