బ్యాంకింగ్‌ ‘బాండ్‌’!

25 Jul, 2019 05:35 IST|Sakshi

రుణాలివ్వడమే కాదు... వినియోగంపైనా పర్యవేక్షణ

ఎగవేతలు, మోసాలతో మారుతున్న బ్యాంకుల రూటు

రుణాల వినియోగంపై పర్యవేక్షణకు ఏజెన్సీల సేవలు

న్యూఢిల్లీ: రుణాల విషయంలో కార్పొరేట్‌ సంస్థలు మోసాలకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో బ్యాంకులు రూటు మార్చుకుంటున్నాయి. కేవలం రుణాలు జారీ చేయడానికే పరిమితమై పోకుండా, తీసుకున్న రుణాలను కంపెనీలు ఏ విధంగా వినియోగిస్తున్నాయనేది పర్యవేక్షించేందుకు వెలుపలి ఏజెన్సీల సాయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర బ్యాంకులతో కలసి కన్సార్షియం కింద జారీ చేసే రూ.250 కోట్లకు మించిన రుణాల విషయంలో ఏజెన్సీ సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నాయి.

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ రుణం రూపంలో మోసం చేసినట్టు వెలుగు చూడడం, కంపెనీల ఆర్థిక అంశాలపై కచ్చితమైన సమాచారం విషయంలో రేటింగ్‌ ఏజెన్సీలు విఫలమవుతున్న నేపథ్యంలో... ఫోరెన్సిక్‌ ఆడిట్‌ తరహాలో కంపెనీల ఖాతాలపై సర్వే కోసం ఏజెన్సీలను నియమించుకోవాల్సిన అవసరం ఉందని రెండు అగ్ర స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకర్లు తెలిపారు. ప్రస్తుతం అయితే కన్సార్షియం కింద రుణాలను జారీ చేసిన తర్వాత బ్యాంకులు... ప్రధానంగా రేటింగ్‌ ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్‌లు, కంపెనీలు ఇచ్చే సమాచారానికే పరిమితం అవుతున్నాయి. వీటి ఆధారంగానే ఆయా కంపెనీల ఆర్థిక ఆరోగ్యాన్ని అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) స్థాయిలో చర్చ జరిగిందని, అకౌంటింగ్‌ సంస్థలను నియమించుకోవడం ఈ ప్రతిపాదనలో భాగమని బ్యాంకరు తెలిపారు. ఇప్పటికే ఐబీఏ 75 సంస్థలను కూడా గుర్తించి బ్యాంకుల స్థాయిలో పంపిణీ చేయడం జరిగినట్టు చెప్పారు.  

ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో...
‘‘ఇది నూతన యంత్రాంగం. ఇప్పటికే అకౌంటింగ్‌ సంస్థలను గుర్తించాం. తీసుకున్న రుణాలను కంపెనీలు వినియోగించే తీరుపై ఎప్పటికప్పుడు ఇవి పర్యవేక్షణ నిర్వహిస్తాయి. అలాగే, క్రమం తప్పకుండా బ్యాంకులకు నివేదికల రూపంలో తెలియజేస్తాయి’’ అని యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈవో అశోక్‌ కుమార్‌ ప్రధాన్‌ తెలిపారు. ఇప్పటికైతే తాము అందుకున్న స్టేట్‌మెంట్స్‌పై ఎక్కువగా వివరాలు వెల్లడించలేమంటూ... సంబంధిత ఆడిటింగ్‌ సంస్థలు కంపెనీల పుస్తకాలను పరీక్షిస్తాయని, ఇది ఫోరెన్సిక్‌ ఆడిట్‌ తరహాలో ఉంటుందన్నారు. కంపెనీల పుస్తకాల్లోని లోపాలను గుర్తించే విషయంలో రేటింగ్‌ ఏజెన్సీలు సమర్థవంతంగా వ్యవహరించడం లేదని గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ పరిణామంతో వెలుగు చూసింది.

రుణాల చెల్లింపుల్లో ఈ సంస్థ వరుసగా విఫలం కావడం, రేటింగ్‌ ఏజెన్సీలు ముందుగా ఈ విషయాలను గుర్తించలేకపోయిన విషయం తెలిసిందే. ఖాతాల్లోని ఆర్థిక ఇబ్బందులు రేటింగ్‌ల్లో ప్రతిఫలించకుండా ఉండేందుకు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులు, రేటింగ్‌ ఏజెన్సీల ఉద్యోగులను ప్రలోభపెట్టినట్టు గ్రాంట్‌ థార్న్‌టన్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో ప్రాథమికంగా వెలుగు చూసింది. ‘‘పర్యవేక్షణ బాధ్యత అన్నది రేటింగ్‌ ఏజెన్సీలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి రేటింగ్‌లు బ్యాంకులతోపాటు వాటాదారులకూ ఎంతో ముఖ్యమైనవి. కానీ, ఇప్పుడున్న విధానంలో ఇది ఫలితాలను ఇవ్వడం లేదు. ఎక్స్‌టర్నల్‌ ఏజెన్సీలను నియమించుకోవాలని ఐబీఏ యోచిస్తుండడం వెనుక కారణం ఇదే. భూషణ్‌ పవర్‌ మోసం వెలుగు చూడడంతో ఈ విధానాన్ని వెంటనే అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని సిండికేట్‌ బ్యాంకు ఎండీ, సీఈవో మృత్యుంజయ మహపాత్ర పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు