ఇక.. బ్యాంకుల విలీన మేళా!!

10 Aug, 2017 03:07 IST|Sakshi
ఇక.. బ్యాంకుల విలీన మేళా!!

క్యూ1 ఫలితాల తర్వాత నుంచి ప్రక్రియ షురూ
పనితీరు, ఆర్థిక భారం తదితర అంశాలే ప్రాతిపదిక


న్యూఢిల్లీ: మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) విలీన ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదంటున్నప్పటికీ.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలన్నీ వెల్లడైన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. విలీనాలపై నిర్ణయాలు తీసుకునే ముందు ఆయా బ్యాంకుల ఆర్థిక పనితీరుతో పాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చని వివరించారు.

ప్రాంతీయంగా సమతుల్యత, భౌగోళికంగా విస్తరణ, ఆర్థిక భారం, మానవ వనరుల ఏకీకరణ మొదలైనవి ఇందులో ఉండగలవని పేర్కొన్నారు. బలహీన బ్యాంకును బలమైన బ్యాంకులో విలీనం చేస్తే పటిష్టమైన బ్యాంకు కూడా కూలిపోయే అవకాశం ఉన్నందున అటువంటి చర్యలు ఉండబోవని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇదంతా కూడా సంక్లిష్టమైన ప్రక్రియగా ఆయన అభివర్ణించారు. ఏదైతేనేం బ్యాంకుల జూన్‌ త్రైమాసిక ఫలితాలు వెల్లడయ్యాక.. ప్రక్రియ ప్రారంభం కాగలదని అధికారి తెలిపారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌తో పాటు అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు.. ఎస్‌బీఐలో విలీనమైన తర్వాత నుంచి మిగతా పీఎస్‌బీల విలీనంపైనా వార్తలు వస్తున్నాయి.

 మొండిబకాయిలు, ఆర్థిక స్థితిగతులు, ఉపయోగిస్తున్న టెక్నాలజీ తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు దేనా బ్యాంకు సహా కొన్ని పీఎస్‌బీలతో ఆర్థిక శాఖ కొన్నాళ్ల క్రితం సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే, పీఎస్‌బీల విలీన ప్రతిపాదనేదీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదంటూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ వారం రోజుల క్రితం లోక్‌సభకు తెలిపారు. ఈ నేపథ్యంలో క్యూ1 ఫలితాల తర్వాత పీఎస్‌బీల విలీన ప్రక్రియ మొదలుకావొచ్చన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా