వాట్సాప్‌కు కేంద్రం గట్టి వార్నింగ్‌

3 Jul, 2018 20:56 IST|Sakshi
లించింగ్‌ వ్యతిరేక ఆందోళన ( ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు భారత ప్రభుత్వం గట్టివార్నింగ్‌ ఇచ్చింది. వాట్సాప్‌ ద్వారా విస్తరిస్తున్న ఫేక్‌ మెసేజ్‌ల అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం మంగళవారం వాట్సాప్‌కు  తక్షణమే తగిన  చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించింది."బాధ్యతారహితమైన, తీవ్ర సందేశాలు" విస్తరించకుండా నిరోధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం వాట్సాప్‌ను  ఆదేశించింది. 

హింసాకాండను  ప్రేరేపిస్తున్న వాట్సాప్‌ మెసేజ్‌ల వ్యాప్తిపై  ప్రభుత్వం ఈ చర్యకు దిగింది. రెచ్చగొట్టే కంటెంట్, సందేశాలు  పునరావృతం కావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫేక్‌  మెసేజ్‌లను నివారించడానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించామని ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ  ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు జవాబుదారీతనం, బాధ్యతలను తప్పించుకోలేదని ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ వాట్సాప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఫేక్‌ సందేశాలు, ఉద్దేశపూర‍్వంగా సృష్టించిన  మెసేజ్‌లు సర్క్యులేట్‌ అవుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.  దీంతో అసోం, మహారాష్ట్ర, కర్నాటక, త్రిపుర, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలలో  "దురదృష్టకర హత్యలు" చోటుచేసుకున్నాయని  ప్రభుత్వం తెలిపింది.  హింసాకాండను ప్రేరేపిస్తున్న  వాట్సాప్‌  మెసేజ్‌లపై ఇప్పటికే పదేపదే  వాట్సాప్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రభుత్వం పేర్కొంది. గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న దారుణ హత్యల నేపథ్యంలో వాట్సాప్‌ సీనియర్‌ ప్రతినిధులకు తమ తీవ్ర అసంతృప్తి తెలియజేశామని, తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించామని చెప్పింది. 

కాగా ఇటీవలి కాలంలో పిల్లల్ని ఎత్తుకెళ్లే వారితో జాగ్రత్త పేరుతో  వాట్సాప్‌లో విపరీతంగా మెసేజ్‌లు షేర్‌ అయ్యాయి. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఇంతటి దారుణాలు  చాలా నమోదవుతున్నాయి. 28 మంది  అమాయకులు బలైపోయిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా