గ్రీస్ బెయిలవుట్.. డైలమా!

13 Jul, 2015 01:35 IST|Sakshi
గ్రీస్ బెయిలవుట్.. డైలమా!

రెండోరోజూ యూరోజోన్ ఆర్థిక మంత్రుల భేటీ
- ఈయూ సదస్సు రద్దు...
- యూరో నేతల మధ్య అభిప్రాయభేదాలే కారణం..    
బ్రసెల్స్:
పతనం అంచున వేళాడుతున్న గ్రీస్‌కు మరో విడత బెయిలవుట్ ప్యాకేజీ డైలమాలో పడింది. కొత్త బెయిలవుట్ కోసం గ్రీస్ చేసిన విజ్ఞప్తి, సంస్కరణల ప్రతిపాదనలపై యూరోజోన్ నేతల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడమే దీనికి కారణం. శనివారం అర్ధరాత్రిదాకా కొనసాగిన యూరోజోన్(19 దేశాలు) ఆర్థిక మంత్రుల సమావేశంలో బెయిలవుట్‌పై ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. ఆదివారం రెండో రోజు కూడా కొనసాగిన ఈ భేటీలో కూడా ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు.

అయితే, ఈ నెల 15కల్లా పన్నుల పెంపు, పెన్షన్లకోతకు సంబంధించిన గ్రీస్ చట్టాలను తీసుకురావాలని యూరో ఆర్థిక మంత్రుల గ్రూప్ డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. మరోపక్క, ఆదివారం జరగాల్సిన యూరోపియన్ యూనియన్(ఈయూ-28 దేశాలు) కీలక సదస్సు రద్దయినట్లు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ ప్రకటించారు. పెన్షన్లలో కోత, పన్నుల పెంపు వంటి కఠిన వ్యయ నియంత్రణ చర్యలు తీసుకుంటామని, తమకు 80 బిలియన్ యూరోలకుపైగా విలువైన మూడో బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాల్సిందిగా గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే.

అయితే, గ్రీస్ ప్రణాళిక యూరోజోన్ నేతల్లో నమ్మకం కలిగించలేకపోయింది. ప్రధానంగా గ్రీస్‌కు అత్యధికంగా రుణాలిచ్చిన జర్మనీ కొత్త షరతులను తెరపైకి తెచ్చింది. తాత్కాలికంగా ఐదేళ్లపాటు గ్రీస్‌ను యూరో(సింగిల్ కరెన్సీ) నుంచి బయటికి పంపాలనేది జర్మనీ వాదన. ఫిన్లాండ్ కూడా గ్రీస్‌కు కొత్త ప్యాకేజీ ఏదీ ఇవ్వాల్సిన అవసరం లేదని కరాఖండీగా పేర్నొన్నట్లు సమాచారం. అయితే, గ్రీస్‌కు రుణాలిచ్చిన అంతర్జాతీయ రుణదాతలు(ఐఎంఎఫ్, ఈసీబీ) మాత్రం ఆ దేశం తాజాగా సమర్పించిన సంస్కరణ ప్రతిపాదనలపై సానుకూలత వ్యక్తం చేయడం గమనార్హం. రిఫరెండంలో గ్రీస్ ప్రజలు తిరస్కరించిన కఠిన షరతులనే ఆ దేశ ప్రభత్వం తాజాగా బెయిలవుట్ ప్యాకేజీ కోసం సమర్పించిన ప్రణాళికలో పొందుపరిచిన సంగతి తెలిసిందే. ఈ ప్రణాళికకు గ్రీస్ పార్లమెంటు శనివారమే ఆమోదముద్ర వేసింది.
 
మరోపక్క, గ్రీస్‌లో ఆర్థిక నియంత్రణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏటీఎంలలో నగదు విత్‌డ్రా పరిమితుల(రోజుకు 60 యూరోలు)తో పాటు బ్యాంకులు కూడా మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి. దాదాపు రెండు వారాలుగా ఇదే తంతు. దేశంలో ఆహార, ఔషధాల నిల్వలు త్వరలోనే ఖాళీ అయ్యే ప్రమాదం కూడా పొంచిఉండటంతో ప్రజలు బిక్కుబిక్ముమంటూ గడుపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు అడుగంటిపోయాయని, త్వరలోనే బ్యాంకులు కుప్పకూలడం ఖాయమనే వార్తలు వినబడుతున్నాయి.

మరిన్ని వార్తలు