గ్రీస్ డిఫాల్ట్..

2 Jul, 2015 01:32 IST|Sakshi
గ్రీస్ డిఫాల్ట్..

ఐఎంఎఫ్‌కు రుణ చెల్లింపుల్లో
- యూరోజోన్, రుణదాతలకు తాజా సంస్కరణల ప్రతిపాదన
- కొత్త బెయిలవుట్‌కోసం గ్రీస్ ప్రధాని విజ్ఞప్తి..
బ్రసెల్స్:
అనుకున్నంతా అయింది. ఆఖరినిమిషం వరకూ జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రీస్ చివరకు ఐఎంఎఫ్‌కు చెల్లించాల్సి ఉన్న 1.7 బిలియన్ డాలర్ల బకాయి విషయంలో చేతులెత్తేయడంతో  అనధికారికంగా డిఫాల్ట్ జరిగిపోయింది. తమకు బకాయిలు అందలేదని ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి కూడా వాషింగ్టన్‌లో ధ్రువీకరించారు. దీంతో ఐఎంఎఫ్ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన తొలి అభివృద్ధి చెందిన దేశంగా గ్రీస్ నిలిచింది. అంతేకాకుండా 2001లో జింబాబ్వే తర్వాత ఐఎంఎఫ్ రుణచెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన మొట్టమొదటి దేశం కూడా ఇప్పుడు గ్రీస్ కావడం గమనార్హం.

అయితే నిర్ణీత తేదీనాటికి రుణ వాయిదా చెల్లింపు విఫలమైన తర్వాత నెలరోజులవరకూ ఆ మొత్తం అందకపోతే, అధికారికంగా ఆ దేశం దివాలా తీసినట్లు ఐఎంఎఫ్ ప్రకటిస్తుంది. మరోపక్క, ఈయూతో తాజాగా చర్చలు జరిపేందుకు వీలుగా చెల్లింపుల డెడ్‌లైన్ గడువు పెంచే అంశాన్ని కూడా ఐఎంఎఫ్ పరిశీలిస్తోంది. పాత బకాయి చెల్లిస్తే మళ్లీ తమ రుణాలు కొనసాగుతాయని ఐఎంఎఫ్ ప్రతినిధి గెర్రీ రైస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  కాగా, గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ తమకు మరో కొత్త బెయిలవుట్ ప్యాకేజీని ఇవ్వాల్సిందిగా మరోసారి రుణదాతలకు విజ్ఞప్తి చేశారు. అయితే, గతంలో తాము ప్రతిపాదించిన బెయిలవుట్ షరతులపై ఆదివారం గ్రీస్‌లో జరగనున్న రిఫరెండం పూర్తయ్యేదాకా ఎలాంటి సంప్రదింపులూ సాధ్యంకాదని జర్మనీ ఆర్థిక మంత్రి ఉల్ఫ్‌గాంగ్ షాబుల్ తేల్చిచెప్పారు కూడా.

అయితే, గ్రీస్ ప్రధాని తాజా విజ్ఞప్తిపై యూరోజోన్ ఆర్థిక మంత్రులు బుధవారం పొద్దుపోయాక చర్చలుజరిపారు. ఆదివారం వరకూ ఇక ఎలాంటి సంప్రదింపులూ జరపకూడదని వారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రీస్ తమ షరతులకు అంగీకరించకపోవడంతో యూరోపియన్ యూనియన్(ఈయూ)-అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) అందిస్తూవస్తున్న బెయిలవుట్ ప్యాకేజీని మంగళవారం(జూన్ 30) అర్ధరాత్రితో నిలిపివేశాయి. దీంతో ఐఎంఎఫ్‌కు  బకాయి చెల్లించలేక గ్రీస్ డిఫాల్ట్‌కావాల్సి వచ్చింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ గ్రీస్ ఎలాంటి అంతర్జాతీయ ఆర్థిక సాయం లేకుండా ఒంటరైంది.
 
మరింత దిగజారిన పరిస్థితులు...
గ్రీస్ అధికారికంగా డిఫాల్ట్ కావడంతో అక్కడ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత తీవ్రం అవుతున్నాయి. ఈ నెల 6 వరకూ బ్యాంకులను మూసేయడంతో ప్రజలు రోడ్లమీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంల ముందు క్యూ కడుతున్నారు. అయితే, పెన్షనర్లకు మాత్రం తమ సొమ్ము తీసుకోవడానికి వీలుగా బుధవారం సుమారు 1,000 బ్యాంక్ బ్రాంచ్‌లు తెరిచినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాగా, గ్రీస్ ప్రధాని తాజాగా రుణదాతలకు రాసిన తాజా విజ్ఞప్తి లేఖలో బెయిలవుట్ షరత్తుల్లో కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

ఇందులో ముఖ్యంగా తమ దీవుల్లో ఇప్పుడున్న 30 శాతం వ్యాట్ రాయితీని యథాతథంగా కొనసాగనివ్వాలని.. అదేవిధంగా 2012 నాటి పెన్షన్ సంస్కరణలను ఈ ఏడాది అక్టోబర్‌దాకా వాయిదా వేయాలని సిప్రస్ ప్రతిపాదించారు. దీనికి ఓకే అంటే రుణదాతలు గతంలో ప్రతిపాదించిన డీల్‌కు తాము ఆమోదం తెలుపుతామని పేర్కొన్నారు. కాగా, యూరోజోన్ నుంచి వైదొలిగే ప్రమాదాన్ని నివారించాలంటే తమకు యూరోపియన్ స్థిరత్వ యంత్రాంగం(ఈఎస్‌ఎం) నుంచి మరో 30 బిలియన్ యూరోల విలువైన బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాలని గ్రీస్ కోరుతోంది.

అంతేకాకుండా రెండేళ్లపాటు తమ రుణాలన్నింటినీ పునర్‌వ్యవస్థీకరించాలని కూడా విజ్ఞప్తి చేసింది. దీనికి అంగీకరిస్తే గ్రీస్‌కు ఇది మూడో బెయిలవుట్  ప్యాకేజీ అవుతుంది. 2010 నుంచి ఇప్పటివరకూ ఈయూ-ఐఎంఎఫ్‌లు రెండు ప్యాకేజీలు(240 బిలియన్ యూరోలు)ను అందిస్తూవచ్చాయి. అయితే, గ్రీస్‌కు ఇస్తున్న సహాయ ప్యాకేజీ మంగళవారం అర్ధరాత్రితోనే ముగిసిపోయిందని.. అంతేకాకుండా ఈయూ ఆఫర్‌ను గతవారంలోనే గ్రీస్ ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో ఇప్పుడు గత ప్రతిపాదనలకు తావులేదని  జర్మనీ ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు.
 
రిఫరెండం నిలిపివేత సంకేతాలు...

కాగా, బెయిలవుట్ షరతులకు వ్యతిరేకంగా ఓటు వేయాలన్న వాదనలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆదివారం జరగనున్న రెఫరెండంను విరమించుకోవాలని కూడా గ్రీస్ ప్రధాని సిప్రస్‌పై యూరోపియన్ నేతలు ఒత్తిడితీసుకొస్తున్నారు. అయితే తమ కొత్త బెయిలవుట్ విజ్ఞప్తికి యూరోజోన్ మంత్రులు అంగీకరిస్తే.. రిఫరెండంను సస్పెండ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గ్రీస్ అధికారిక వర్గాలు సంకేతాలిచ్చాయి.

మరిన్ని వార్తలు