జూలై 6 వరకూ గ్రీస్ బ్యాంకుల మూత...

30 Jun, 2015 00:32 IST|Sakshi
జూలై 6 వరకూ గ్రీస్ బ్యాంకుల మూత...

 ఏటీఎం విత్‌డ్రాయెల్ పరిమితి రోజుకు 65 డాలర్లు
 బెయిలవుట్ డీల్‌పై 5న రిఫరెండమ్

 
 ఏథెన్స్: గ్రీస్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. జూలై 6వ తేదీ వరకూ బ్యాంకులు పనిచేయవని, బ్యాంకులు మూసి ఉంచిన ఈ కాలంలో రోజుకు 60 యూరోలు (65 డాలర్లు) మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చంటూ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ఉత్తర్వులు ఈ సంక్షోభాన్ని స్పష్టంచేశాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డానికి కొత్త రుణాలు తీసుకోవాల్సి ఉండగా... ఈ రుణాల కోసం పెట్టే షరతుల్ని అంగీకరించాలా? వద్దా అనేది తేల్చడానికి ప్రభుత్వం జూలై 5న రిఫరెండమ్ (ప్రజాభిప్రాయ సేకరణ) జరపనుంది. ఆ మర్నాటి వరకూ బ్యాంకింగ్‌కు సంబంధించి కొన్ని పరిమితులు విధించింది. జూన్ 28 నుంచి జూలై 6 వరకూ అమల్లో ఉండే ఈ పరిమితులపై అధ్యక్షుడు, ప్రధాని సంతకం చేశారు.
 
 డిక్రీ ప్రధానాంశం...: ‘‘షరతులకు కట్టుబడనిదే గ్రీస్‌తో రుణ ఒప్పందాన్ని (క్రెడిట్ లైన్) పొడిగించే ప్రశ్నేలేదని జూన్ 27న యూరో గ్రూప్ నిర్ణయించింది. దీంతో లిక్విడిటీకి (ద్రవ్య సరఫరా) ఇబ్బందులొచ్చే పరిస్థితి ఏర్పడింది’ అని తాజా డిక్రీలో పేర్కొన్నారు. గ్రీస్ బ్యాంకులకు అందించే అత్యవసర ద్రవ్య సహాయం(ఈఎల్‌ఏ) కింద అదనపు నిధులు ఇవ్వబోమని సైతం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ఆదివారం స్పష్టంచేసింది. నగదు ఉపసంహరణలపై ఆంక్షలు విధిస్తారని ఆదివారమే వార్తలు రావటంతో ప్రజలు ఏటీఎంల ముందు బారులు తీరారు. పెన్షనర్లూ పెద్ద ఎత్తున ఏటీఎంల ముందు బారులు తీరారు.
 
 మినహాయింపులూ ఉన్నాయ్..: బ్యాంక్ లావాదేవీల పరిమితుల నుంచి పెన్షన్ పేమెంట్లను ప్రభుత్వం మినహాయించింది. బ్యాంక్ అకౌంట్లలోకి వివిధ సంస్థలు వేతన బదలాయింపులు చేయడానికి కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని  తెలిపింది. గ్రీస్‌లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. షాపుల్లో కార్డ్ పేమెంట్ల విషయంలో సాధారణ పరిస్థితులే ఉంటాయి. అయితే నగదు విదేశీ బదలాయింపుల అంశానికి మాత్రం ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతి అవసరం.

మరిన్ని వార్తలు