సెజ్‌ పాలసీ అధ్యయనానికి గ్రూప్‌

7 Jun, 2018 01:11 IST|Sakshi

వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటన

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్స్‌ (సెజ్‌) పాలసీ అధ్యయనానికి ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. భారత్‌ ఫోర్జ్‌ చైర్మన్‌ బాబా కల్యాణి దీనికి హెడ్‌గా వ్యవహరిస్తారని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘గ్రూప్‌ సెజ్‌ పాలసీని విశ్లేషిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఎగుమతిదారుల అవసరాలను తీర్చేందుకు అవసరమైన సలహాలను సూచిస్తుంది.  ఇతర వాటితో పోలుస్తూ పాలసీకి సంబంధించిన తులనాత్మక విశ్లేషణను రూపొందిస్తుంది’ అని వివరించింది.

ఈ గ్రూప్‌ మూడు నెలల కాలంలో తన ప్రతిపాదనలను ఒక నివేదిక రూపంలో మంత్రిత్వ శాఖకు అందజేస్తుంది. ఇక గ్రూప్‌లో శ్రీసిటీ సెజ్‌ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, కె రహేజ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజ, టాటా స్టీల్‌ సెజ్‌ ఎండీ అరుణ్‌ మిశ్రా, మహీంద్రా లైఫ్‌ స్పేస్‌ డెవలపర్‌ ఎండీ అనిత అర్జున్‌దాస్‌ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడ్, కర్నాటక, గుజరాత్‌ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు (పరిశ్రమలు) సభ్యులుగా ఉంటారు. 

మరిన్ని వార్తలు