అపుడు ఇండిగో.. ఇపుడు ఉబెర్‌

15 Nov, 2017 09:23 IST|Sakshi

సాక్షి,  బెంగళూరు: ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ సిబ్బంది​ ఆగడాల పర్వం కొనసాగుతుండగానే బెంగళూరులో  టాక్సీ అగ్రిగేటర్‌ ఉబెర్‌ డ్రైవర్ల దాష్టీకం ఒకటి వెలుగు  చూసింది. సీట్‌ బెల్ట్‌ అడిగిన పాపానికి   ఒక ప్రయాణికుడిపై అమానుషంగా దాడిచేసిన ఘటన  ఆందోళన రేపింది.

బాధితుడు దావే బెనర్జీ తనపై జరిగిన దాడి సంగతిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.  దాదాపు 20మంది ఉబెర్‌  డ్రైవర్లు మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారంటూ ట్విట్టర్‌లో ఫోటోలను పోస్ట్‌ చేశారు. అంతేకాదు ఈ  ఉదంతంపై ఉబెర్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే..పోలీసులకు ఫిర్యాదు చేసుకోమంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని  ఆరోపించారు.

సంఘటన  పూర్వాపరాల్లోకి  వెడితే బెంగళూరుకు చెందిన  వ్యాపారవేత్త  దావే  బెనర్జీ ముంబైనుంచి విమానంలో రాత్రి 9గంటలకు బెంగళూరు చేరుకున్నారు. అక్కడనుంచి ఇంటికి వెళ్లేందుకు ఉబెర్‌ బుక్‌ చేసుకున్నారు. కారు వెనకు సీటులో సీట్‌ బెల్ట్‌ లేకపోవడాన్ని గమనించి  ఉబెర్‌ డ్రైవర్‌ని ప్రశ్నించారు.  రెండుసార్లు అడిగినా సమాధానం లేకపోవడంతో  ఆయన..డ్రైవర్‌ని భుజంతట్టి ..కారు ఆపమని కోరారు. అంతే ఆగ్రహంతో ఊగిపోతూ కారు దిగిన క్యాబ్‌  డ్రైవర్‌ ఇతర డ్రైవర్లను పిలిచి మరీ బెనర్జీపై దాడికి దిగారు.  20మంది  డ్రైవర్లు సుమారు 40 నిమిషాలపాటు తమ అఘాయిత్యాన్ని కొనసాగించారు. ఎట్టకేలకు వారినుంచి బయటపడి  మరో క్యాబ్‌ బుక్‌ చేసుకుని ఇంటి చేరారు బెనర్జీ.

ఈ ఘటనపై బాధితుడి భార్య ఆగ్రహం వ్యక‍్తం చేశారు. దీనిపై న్యాయపోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఈ విషయంలో దుమారం రేగడంతో దిగి వచ్చిన ఉబెర్‌ ఒక ప్రకటన చేసింది.  ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని, దాడి ఘటనలో న్యాయ విచారణకు సహకరిస్తామని ప్రకటించింది.

అయితే తమకు ఇంతవరకు తమకు ఎలాంటి ఫిర్యాదు లేదనీ, ఫిర్యాదు అందిన  వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని బెంగుళూర్ నార్త్ ఈస్ట్ డివిజన్ పోలీసు అధికారులు  తెలిపారు.
 

మరిన్ని వార్తలు