జీడీపీ వృద్ధికి జీఎస్‌టీ బ్రహ్మాస్త్రం

27 Nov, 2015 01:29 IST|Sakshi
జీడీపీ వృద్ధికి జీఎస్‌టీ బ్రహ్మాస్త్రం

బిల్లు ఆమోదం కోసం విపక్షాలు సహకరించాలి
 అసోచాం ప్రెసిడెంట్ సునిల్ కనోరియా

 
 న్యూఢిల్లీ: అధిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సాధించడానికి వస్తు,సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) అమలు బ్రహ్మాస్త్రం కాగలదని పరిశ్రమ వర్గాల సమాఖ్య అసోచాం పేర్కొంది. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావే శాల్లో జీఎస్‌టీ సవరణ బిల్లు ఆమోదం పొందే దిశగా తోడ్పడాలని విపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేసింది. ‘మన జీడీపీకి జీఎస్‌టీ ఒక ‘బ్రహ్మాస్త్రం’లాంటిది. అన్ని పార్టీల నేతలు దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును మరింత జాప్యం జరగకుండా తక్షణం ఆమోదించాల్సిన అవసరం ఉంది’ అని అసోచాం నూతన ప్రెసిడెంట్ సునిల్ కనోరియా పేర్కొన్నారు.
 
  తద్వారా దేశప్రయోజనాల కోసం పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తాయని, అంతర్జాతీయ సవాళ్లను రాజకీయ సంకల్పంతో భారత ఎకానమీ ధైర్యంగా ఎదుర్కొనగలదని ఇన్వెస్టర్లకు స్పష్టమైన సంకేతమిచ్చినట్లు అవుతుందని ఆయన చెప్పారు. డిమాండ్ మందగమనం, పారిస్‌లో  దాడుల తర్వాత భౌగోళికరాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి, కీలకమైన కమోడిటీలు గతంలో ఎన్నడూ లేనంతగా పతనం కావడం తదితర అంశాలతో ఎకానమీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. జీఎస్‌టీని సకాలంలో అమలు చేస్తే జీడీపీ కనీసం 1.5-2 శాతం దాకా వృద్ధి చెందగలదని కనోరియా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలకు అభ్యంతరాలేమైనా ఉంటే ప్రభుత్వం వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
 
 ఉద్యోగాల కల్పన ప్రధాన సవాలు..
 ప్రతి నెలా ఉద్యోగార్థుల సంఖ్య పది లక్షల పైగా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో వీరికి ఉద్యోగాలు కల్పించడం ప్రధాన సవాలుగా ఉంటోందని కనోరియా పేర్కొన్నారు. దీన్ని పరిష్కరించాలంటే మెరుగైన మౌలిక సదుపాయాలు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు, తక్కువ వడ్డీలపై రుణాలు లభించడం తదితర అంశాలు కీలకమని తెలిపారు. మొండి బకాయిల సమస్య ఎక్కువగా ఉన్న ఉక్కు, విద్యుత్, రహదారులు తదితర రంగాల కంపెనీలు వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు బ్యాంకులకు తక్షణం మరింత మూలధనం సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా మొండి బకాయిలు పేరుకుపోయిన సంస్థలను కొత్త ప్రమోటర్లకు బదలాయించేలా కొత్త దివాలా చట్టాన్ని సత్వరం అమల్లోకి తేవాలని కనోరియా చెప్పారు.
 
 పెట్టుబడులు వస్తాయ్..: వ్యాపారానికి అనువైన పరిస్థితులు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పెట్టుబడుల రాక ఊపందుకుంటోందని కనోరియా చెప్పారు. పెట్టుబడుల రాకపరంగా 2016-17 ఆర్థిక సంవత్సరం కొంత వరకే బాగున్నా, ఆ తర్వాత రెండు ఆర్థిక సంవత్సరాలు మాత్రం చాలా మెరుగ్గా ఉండగలవని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. మరోపక్క, దేశంలో అసహన పరిస్థితుల వార్తలతో పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతోందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. భారత్ అత్యంత ప్రజాస్వామిక, సహనశీల దేశమని కనోరియా చెప్పారు. అసహనాన్ని కూడా సహిస్తోండటమే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు..
 
 మోదీ బాగా మార్కెటింగ్ చేస్తారు..
 భారత్‌ను మార్కెటింగ్ చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన  పాత్ర పోషిస్తున్నారని కనోరియా తెలిపారు. ప్రధానితో తరచూ సమావేశం కాకపోయినా.. ఆయా సందర్భాలను బట్టి అసోచాం తన అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటుందని చెప్పారు. అటు వడ్డీ రేట్ల విషయంలో ఆర్‌బీఐ గవర్నరు, ఆర్థిక మంత్రిని దేవుళ్లతో పోల్చారు కనోరియా. ఆర్‌బీఐ గవర్నరు విష్ణువు లాంటివారని, ఆర్థిక మంత్రి లక్ష్మీ దేవిలాంటివారని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇటు ద్రవ్యోల్బణం, అటు వడ్డీ రేట్లను కట్టడి చేస్తూ వీరు సమతౌల్యత పాటించాల్సి ఉంటుందని కనోరియా చెప్పారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా