మళ్లీ రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు

2 Jan, 2020 08:10 IST|Sakshi

డిసెంబర్‌లో రూ. 1.03 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: వినియోగం పుంజుకుంటోందనడానికి నిదర్శనంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో నెలలో రూ. 1 లక్ష కోట్ల మైలురాయిని దాటాయి. డిసెంబర్‌లో రూ. 1,03,184 కోట్ల మేర జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. అంతక్రితం నవంబర్‌ నెలలో ఈ వసూళ్లు రూ. 1,03,492 కోట్లు. గతేడాది జూలైలో రూ. 1.02 లక్షల కోట్లు నమోదు కాగా, 2018 డిసెంబర్‌లో రూ. 94,726 కోట్లు వసూలయ్యాయి.  నిబంధనలను పాటించే విధానం, వినియోగం మెరుగుపడుతున్నాయనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని అధికార వర్గాలు తెలిపాయి. 2018 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్‌లో దేశీయంగా లావాదేవీలపై జీఎస్‌టీ వసూళ్లు 16 శాతం వృద్ధి నమోదు చేశాయి.

డిసెంబర్‌లో వసూలైన రూ. 1,03,184 కోట్లలో .. సీజీఎస్‌టీ భాగం రూ. 19,962 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ. 26,792 కోట్లు, ఐజీఎస్‌టీ రూ. 48,099 కోట్లు, సెస్సు రూ. 8,331 కోట్లుగా ఉన్నాయి. ద్రవ్య లోటు కట్టడీలో ఉండాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా నెలల్లో కూడా ఇదే తరహాలో వసూళ్లు కొనసాగాల్సి ఉంటుందని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ ఎంఎస్‌ మణి అభిప్రాయపడ్డారు. వార్షిక లక్ష్యం స్థాయిని అందుకోలేకపోయినా.. ఇక నుంచి వసూళ్లు స్థిరంగా మెరుగుపడవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో ప్రతి నెలా రూ. లక్ష కోట్ల జీఎస్‌టీ వసూళ్ల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది.

మరిన్ని వార్తలు