బడ్జెట్‌ డే : అమలులోకి వచ్చిన ఈ-వే బిల్లు

1 Feb, 2018 09:55 IST|Sakshi
ఈ-వే బిల్లుల కోసం బారులు తీరిన వాహనాలు(ఫైల్‌)

న్యూఢిల్లీ : వార్షిక బడ్జెట్‌ వెలువడనున్నరోజే దేశవ్యాప్తంగా జీఎస్టీ ఈ-వే బిల్లు విధానం కూడా అమలులోకి వచ్చింది. జీఎస్టీని అనుసరించి ఏవేనీ రెండు రాష్ట్రాల మధ్య రూ.50 వేలకు మించి విలువ కలిగిన సరకులను రవాణా చేయాలంటే నేటినుంచి (ఫిబ్రవరి 1నుంచి)  ఎలక్ట్రానిక్‌ వే (ఈ-వే) బిల్లు తప్పనిసరి. ఒక ఇ-వే బిల్లు 100 కిలోమీటర్ల కంటే తక్కువ దూరానికి ఒక రోజు చెల్లుతుంది. దీని తరువాత ప్రతి 100 కిలోమీటర్లకి, సంబంధిత తేదీ నుండి ఒక రోజుకు చెల్లుబాటు అవుతుంది. ఈ-వే బిల్లును 24 గంటలలో రద్దు చేయవలసి ఉంటుంది.

పన్నుల ఎగవేతను నిరోధించడం కోసమే రూపొందించిన ఈ-వే బిల్లు విధానం.. జీఎస్టీ రూపకల్పనలో కీలక అంశంగా పేర్కొన్నారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో జరిగిన 24వ జీఎస్టీమం డలి సమావేశంలో ఈ-వే బిల్లులను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి 15 నుంచే ఈ-వే అమలును ప్రయోగాత్మకంగా చేపట్టారు. పలు రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతమైనట్లు జీఎస్టీ నెట్‌వర్క్‌ సీఈవో ప్రకాశ్‌ కుమార్‌ తెలిపారు. గడిచిన 15 రోజుల్లో సుమారు 2.84 కోట్ల ఈ-వే బిల్లులు జారీ అయ్యాయని, జనవరి 30న గరిష్టంగా 3,40,000 ఈవే బిల్లులు జారీ అయినట్లు కుమార్‌ తెలిపారు. ఇప్పటివరకు ట్రాన్స్‌పోర్టర్లు, పన్నుచెల్లింపుదారులు అంతా కలిపి  6.70లక్షల మంది ఈ-వే బిల్లు విధానంలో పేర్లను నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి అంతర్రాష్ట్ర రవాణాకు ఈ-వే బిల్లు తప్పనిసరి అయినట్లే.. జూన్‌1 నుంచి రాష్ట్రంలో అంతర్గత రవాణాలకూ ఈ-వే బిల్లు వర్తించనుంది.

పారిశ్రామిక వర్గాల ఆందోళన : కాగా, రూ.50 వేలకు మించి విలువ కలిగిన సరకుల రవాణాకు ఈ-వే బిల్లును తప్పినిసరి చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. రూ.5లక్షలకు మించి విలువ కలిగిన సరుకులకు మాత్రమే వర్తింపజేయాలని, ఈ-వే బిల్లు చెల్లుబాటు గడువును 24 గంటలు(ఒక రోజు) కాకుండా ఐదు రోజులకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు